మహబూబ్ నగర్లో రోడ్డు ప్రమాదం.. చేపల లోడ్, కూరగాయల ట్రేలు మాయం చేసిన జనాలు

మహబూబ్ నగర్లో రోడ్డు ప్రమాదం.. చేపల లోడ్, కూరగాయల ట్రేలు మాయం చేసిన జనాలు
  •     పాలమూరు జిల్లా అడ్డాకుల సమీపంలో యాక్సిడెంట్​ 
  •     చేపల లోడ్, కూరగాయల ట్రేలు మాయం చేసిన జనాలు

అడ్డాకుల: మహబూబ్​నగర్​ జిల్లా అడ్డాకుల సమీపంలోని స్నేహ కంపెనీ వద్ద రెండు డీసీఎంలు ఢీకొని ఇద్దరు చనిపోయారు. అయితే, ప్రమాదం జరిగాక చేపల లోడ్​తో పాటు కూరగాయల కోసం ఉపయోగించే ట్రేలను జనాలు ఎత్తుకెళ్లారు. ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం..హైదరాబాద్ నుంచి కూరగాయలు తెచ్చేందుకు అనంతపురం వెళ్తున్న డీసీఎం 44వ జాతీయ రహదారిపై స్నేహ చికెన్ కంపెనీ ముందు అర్ధరాత్రి రెండు గంటలకు అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. అదే టైంలో బెంగళూరు నుంచి హైదరాబాద్​కు చేపల లోడ్​తో వెళ్తున్న  మరో డీసీఎం బోల్తా పడిన డీసీఎంను ఢీకొట్టింది. కూరగాయల డీసీఎం డ్రైవర్ సుధాకర్(35) తీవ్రంగా గాయపడి చనిపోయాడు. మరో డీసీఎం క్లీనర్ మహ్మద్ హుస్సేన్​(25) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని పోలీసులు మహబూబ్ నగర్ జిల్లా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ప్రమాదంతో హైవేపై రాకపోకలు స్తంభించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

అరగంటలో చేపల లోడు మాయం  

ప్రమాదం జరిగినప్పుడు కూరగాయల కోసం వెళ్తు న్న డీసీఎం ఖాళీగా ఉండగా, మరో వ్యాన్ ​చేపలతో నిండి ఉంది. యాక్సిడెంట్​తర్వాత కూరగాయల ట్రేలు, చేపల డీసీఎంలోని చేపల ట్రేలు కింద పడ్డాయి. తెల్లారిన తర్వాత గమనించిన స్థానికులు ఖాళీ ట్రేలతో పాటు చేపల ట్రేలను ఎత్తుకెళ్లారు. కొందరైతే డీసీఎం ఎక్కి మరీ చేపలను తీసుకుపోయారు. మరికొందరు చేపలను సంచుల్లో వేసుకెళ్లడం కనిపించింది. కేవలం అరగంటలో చేపల లోడ్​ను ఖాళీ చేశారు.  

బైక్​ను ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

పిట్లం, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారి 161పై పోచారం గేట్​వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర దెగ్లూర్​కు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దకొడప్​గల్​ ఎస్సై కోనారెడ్డి కథనం ప్రకారం..మంగళవారం ఉదయం దెగ్లూర్​కు చెందిన వెంకటేశ్​ శంభాజీ బన్సుడే (30), వాగ్మెరే నిఖిల్​(20), సూర్యవంశీ సోమ్​నాథ్ ​బైక్​పై మండలంలోని తలాబ్​తండాలో ఇంటి నిర్మాణం కోసం స్లాబ్​వేయడానికి వస్తున్నారు. పోచారం గేట్​వద్ద రోడ్డు క్రాస్​ చేస్తుండగా హైదరాబాద్​ నుంచి నాందేడ్​ వెళ్తున్న కారు బైక్​ను ఢీకొట్టడంతో వెంకటేశ్​ శంభాజీ బన్సుడే, వాగ్మెరే నిఖిల్ చనిపోయారు. తీవ్రంగా గాయపడిన సూర్యవంశీ సోమ్​నాథ్​ను బిచ్కుంద హాస్పిటల్​కు తరలించారు.  కారు డ్రైవర్ మనీష్ అగర్వాల్ కు గాయాలు కాలేదు. ఆయన భార్య స్వల్పంగా గాయపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.

Also Read:317 జీవోను రద్దు చేసి న్యాయం చేయండి