రోడ్ టెర్రర్ .. ప్రమాదాల్లో అత్యధికం బైకు యాక్సిడెంట్లే

రోడ్ టెర్రర్  .. ప్రమాదాల్లో అత్యధికం  బైకు యాక్సిడెంట్లే
  • మృతుల్లో 30 ఏండ్ల లోపు యువకులే ఎక్కువ
  • ఏడాది కాలంగా ఉమ్మడి మెదక్​లో 986  మంది మృతి
  • రాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, డిమ్ లైటింగ్.. ఇలా అనేక కారణాలు

సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్​ జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు నెత్తురు పారిస్తున్నాయి. ప్రాణాలు కోల్పోతున్న వారిలో యువకులే ఎక్కువగా ఉంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రమాదాలు తగ్గాయని పోలీసులు పేర్కొంటున్నా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పెరిగింది.  ఉమ్మడి మెదక్ జిల్లాలో గత ఏడాది కాలంలో రోడ్డు ప్రమాదాల్లో  986 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 1106 మంది తీవ్రంగా గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. పోలీసు శాఖ అనేక చర్యలు తీసుకుంటున్నా  పూర్తి స్థాయిలో ప్రమాదాలను అరికట్ట లేకపోతోంది. జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే నేషనల్​ హైవేల కంటే గ్రామీణ రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలే ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా బైక్, ఆటో, టాటా ఏస్​వంటి వాహనాలకు జరిగిన ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. 

ప్రమాదాల్లో యువతే టాప్​

రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా యువకులే ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా హైవేలపై జరుగుతున్న ప్రమాదాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల పైన జరుగుతున్న ప్రమాదాల్లోనే ఎక్కువగా చనిపోతున్నారు. కారణాలేమైనా బైక్, ఆటో  ప్రమాదాల్లోనే మృతుల సంఖ్య పెరుగుతోంది. యువత బైక్ లపై త్రిబుల్​ రైడింగ్​ చేయడం,  ప్యాసింజర్​ ఆటోలో పరిమితికి మించి ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో అరవై శాతం మేర యువకులే ఉంటున్నారు.

ప్రమాదాలకు కారణాలెన్నో..

అతి వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించక పోవడం, గుంతల రోడ్లు వల్ల, వాహనాలకు లైట్లు లేకుండా నడపడం, ప్రమాదకర మూల  మలుపులు యాక్సిడెంట్లకు కారణం అవుతున్నాయి. రాత్రి వేళల్లో యువకులు మద్యం తాగి బైక్​లు నడపడం, మైనర్లు త్రిబుల్​ రైడింగ్​చేయడం,  టీనేజీ యువకుల ర్యాష్​ డ్రైవింగ్ వల్ల బైక్​యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. 

తనిఖీలు చేస్తున్నా ఆగని ప్రమాదాలు

పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తున్నా రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. డ్రంకెన్ డ్రైవ్ తో పాటు జరిమానాలు విధిస్తున్నా ప్రమాదాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. గత ఏడాది కంటే ఎక్కువగా తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు.  ఏడాది కాలంగా సిద్దిపేట జిల్లాలో 9,713 డ్రంకెన్ డ్రైవ్,  ఓవర్ స్పీడ్ పై 86 వేల కేసులు, సంగారెడ్డి జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ 11,404 , మెదక్ జిల్లాలో 4,740 కేసులు నమోదు చేయడమే కాకుండా దాదాపు 20 మందిని జైళ్లకు పంపించారు.

ఉమ్మడి జిల్లాలో జరిగిన పెద్ద ప్రమాదాలు

సిద్దిపేట జిల్లా  చిన్నకోడూరు మండలం శనిగరం వద్ద రాజీవ్ రహదారిపై  జరిగిన ప్రమాదంలో సిద్దిపేట ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజ్​ విద్యార్థులు విపిన్, నాగరాజు, గ్రీష్మలు సంఘటనా స్థలంలోనే చనిపోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.జగదేవ్ పూర్ మండలం మునిగడప గ్రామం వద్ద రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. పత్తి ఏరడానికి ఆటోలో వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో జయమ్మ, శిరీష సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 

మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు  44 వ నంబర్ నేషనల్ హైవే పై  ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు చనిపోయారు. టెక్మల్ మండలం కాదులూర్ - బొడ్మట్ పల్లి మధ్య  జరిగిన ప్రమాదంలో  బొరంచ మోగులయ్య ,  బండారి పెంటయ్య,  పంది ముక్కుల కృష్ణ  మృతి చెందారు. మనోహరబాద్ మండలం కాళ్లకల్ సమీపంలో నేషనల్ హైవే 44 మీద జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. 

మెదక్ పట్టణానికి చెందిన మలేక సుల్తానా హైదరాబాద్ వైపు నుంచి తన ముగ్గురు పిల్లలతో కలిసి స్కూటీ మీద మెదక్ వైపు వస్తుండగా అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న సిమెంట్ దిమ్మెను ఢీకొని కింద పడ్డారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ బలంగా స్కూటీని ఢీ కొనడంతో సుల్తానాతో పాటు ఆమె కొడుకు, కూతురు  స్పాట్ లోనే చనిపోగా మరో పాప గాయాలతో బయటపడింది. మెదక్ పట్టణంలో మెయిన్ రోడ్డు మీద దీపావళి పండగ రోజు టిప్పర్ స్కూటీని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు కవల పిల్లలు చనిపోయారు.    

ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్

రోడ్డు ప్రమాదాల నివారణకు ఎప్పటి నుంచో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఇటీవల తనిఖీలు ముమ్మరం చేశాం. ముఖ్యంగా యువత ప్రమాదాల బారిన ఎక్కువగా పడుతున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణం అవుతోంది. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తూనే యువకులుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రోడ్డు ప్రమాదాల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ రహదారులపై ప్రత్యేక నిఘ పెట్టాం. ఎన్ని భద్రత చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజల్లో చైతన్యం రావాలి. అప్పుడే ప్రమాదాలను తగ్గించగలం. 

చెన్నూరి రూపేశ్, సంగారెడ్డి జిల్లా ఎస్పీ

ఈ ఫోటోలో ఉన్న యువకుల పేర్లు లోకేశ్​, వంశీ సిద్దిపేట జిల్లా  నారాయణరావుపేట మండలం  కొందరావుపల్లి స్వగ్రామం. రెండు రోజుల క్రితం ఫ్రెండ్ బర్త్ డే కోసం సిద్దిపేటలో కేక్  తీసుకుని బైక్ పై  వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురై స్పాట్ లోనే మృతి చెందారు. ఎదురుగా వస్తున్న వాహనానికి లైట్ సరిగ్గా లేకపోవడంతో చీకట్లో రెండు బైక్ లు ఢీకొట్టుకోవడంతో ఇద్దరు యువకులు మృతి  చెందగా మరొక వ్యక్తి  పరిస్థితి సీరియస్ గా ఉంది. రెండు పదులు నిండని ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు.

రెండు నెలల క్రితం  మెదక్​ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలోని  161 నేషనల్​ హైవే సర్వీస్​ రోడ్డులో రాంపూర్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీనేజ్​ యువకులు మృతి చెందారు.  కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి పిట్లం వెళ్లే క్రమంలో రాంపూర్  బ్రిడ్జి సమీపంలోని స్పీడ్ బ్రేకర్ల  వద్ద ఎదురుగా  వస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్​​మీద ప్రయాణిస్తున్న సీతానగర్ గ్రామానికి చెందిన శివసాయి , అజయ్ స్పాట్​లోనే ప్రాణాలు కోల్పోగా విజయ్​ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.