దండకారణ్యంలో ఆదివాసీల కట్టెల బ్రిడ్జి

దండకారణ్యంలో ఆదివాసీల కట్టెల బ్రిడ్జి

భద్రాచలం, వెలుగు: అధికారులు, ఓట్ల కోసం తప్ప మళ్లీ తమ మొహం చూడని నాయకులు సమస్య తీర్చలేదని వారు బాధపడుతూ కూర్చోలేదు. తమ ప్రాబ్లమ్‌‌‌‌ తామే పరిష్కరించుకోవాలనుకున్నరు. అంత కలిసి ఆలోచించి అందుబాటులో ఉన్న వనరులతో కట్టెల బ్రిడ్జి కట్టుకొని రాకపోకలు సాగిస్తున్నరు. ఆ బ్రిడ్జి ఫొటోలు సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌ అవుతున్నాయి. వారి స్ఫూర్తిని అందరూ మెచ్చుకుంటున్నారు.

చత్తీస్‍గఢ్‍ రాష్ట్రం దండకారణ్యంలోని అబూజ్‌‌‌‌మఢ్‍ ప్రాంతంలో ఉధృతంగా ప్రవహించే వాగులు ఆదివాసీల రాకపోకలకు ఇబ్బందులు సృష్టిస్తుంటాయి. నారాయణ్‍పూర్‍ జిల్లా ఓర్చా పోలీస్‍స్టేషన్‍కు 25 కిలోమీటర్ల దూరంలో జాటలూరు అనే ఆదివాసీ గూడెం ఉంది. వైద్యానికి, నిత్యావసరాలు తెచ్చుకోవడానికి, అటవీఉత్పత్తులు అమ్ముకోవడానికి ఓర్చా వెళ్లాలంటే వర్షాకాలంలో ఈ వాగు వారికి అడ్డుగా ఉంది. దీనితో ఇటీవల ఆదివాసీలంతా కలిసి వాగుపై కట్టెలతో వంతెన నిర్మించుకున్నారు. తీగజాతి మొక్కలు, వెదురు బద్దలతో పిల్లర్లలా నిర్మించి ప్రవాహానికి కొట్టుకుపోకుండా రాళ్లతో నింపారు. ఇలా ఆరు పిల్లర్లు నిర్మించి.. వాటి మీదుగా కట్టెలు ఏర్పాటు చేశారు. ఈ కట్టెలు నడిచేందుకు వీలుగా ఉన్నాయి. దీంతో వారి వాగు దాటే కష్టం తీరింది.