ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వన్ నేషన్..వన్ ఎలక్షన్ కు సిద్ధమవుతోంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన ఎన్డీయే ప్రభుత్వం..కమిటీ సిఫారసుల మేరకు జమిలి ఎన్నికలకు సిద్ధమవుతోంది.
ఇందులో భాగంగా బుధవారం ( సెప్టెంబర్ 18) నాడు జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయే శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి..చట్టం చేసేందుకు రంగం సిద్దంచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు..? లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మున్సిపల్, పంచాయత్ ఎన్నికలు ఒకేసారి నిర్వహణ సాధ్యమేనా.. నిర్వహిస్తే.. ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడెపుడు ఎన్నికలు ఉంటాయో ఎన్నికల నిర్వహణ ఎలా ఉండబోతున్నాయి.
బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో వన్ నేషన్..వన్ ఎలక్షన్ కు ఆమోదం తెలపడంతో.. ఇప్పుడు ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ఎన్నికలపై అనేక చర్చలు జరుగుతున్నాయి. లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం.. గతేడాది మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేసింది. రామ్ నాథ్ కోవింద్ కమిటీ.. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నిర్వహనకు చేయాల్సిన వివిధ రాజ్యాంగం సవరణలను సిఫారసు చేస్తూ లోక్ సభ ఎన్నికలకు ముందుకు 2024 మార్చిలో కమిటి తన నివేదికను సమర్పించింది.
కోవింద్ ప్యానెల్ మొదటి దశగా లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించాలని సిఫారసు చేసింది. తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని సూచించింది. దీనికి రాజ్యాంగ సవరణలు అవసరం.. అయితే పార్లమెంట్ ఆమోదం తెలిపితే చాలు.. రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని చెప్పింది.
రెండో దశలో లోక్ సభ, అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన 100 రోజులలోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని సూచించింది. దీనికి సగానికి తగ్గకుండా రాష్ట్రాల ఆమోదం అవసరమని సిఫారసు చేసింది.
ఏయే రాష్ట్రాలకు ఎన్నికలు వస్తాయి..?
గతేడాది 10 రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికల జరిగాయి. 2023లో హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీష్ గఢ్, రాజస్థాన్ జరిగాయి. కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వీటికి మళ్లీ 2028లో ఎన్నికలు నిర్వహిస్తారు.2029లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తే..కొత్త ప్రభుత్వాలు సంవత్సరం పాటు అదనంగా అధికారంలో ఉంటాయి.
ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ లలో షెడ్యూల్ ప్రకారం 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అమలులోకి వస్తే.. రెండేళ్ల పాటు అదనంగా అధికారంలో ఉంటాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళలో 2026లో ఎన్నికలకు వెళతాయి. ఒకవేల ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మూడేళ్లపాటు కొనసాగాల్సి ఉంటుంది.
ఏకకాలంలో ఎన్నికలు రాజ్యాంగానికి విరుద్ధంగా జరగకుండా చూసుకునేందుకు కోవింద్ కమిటీ లోక్ సభ కాల వ్యవధికి సంబంధించిన ఆర్టికల్ 83కి , రాష్ట్ర అసెంబ్లీ కాలవ్యవధికి సంబంధించిన ఆర్టికల్ 172కి సవరణలు చేయాలని సిఫారసు చేసింది.