
ఎండ కూడా లెక్కచేయకుండా..
ఎండే వీళ్లకు అన్నం పెడుతోంది. కష్టాన్నే నమ్ముకున్న కొంతమంది మహిళలు రోడ్డు పక్కనే వ్యాపారాలు చేస్తున్నరు. సీజనల్ బిజినెస్ చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నరు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎర్రని ఎండలో పండ్లు, జ్యూస్‍లు, కొబ్బరి బోండాలు అమ్ముతున్నరు. ఇలా ఒకరిద్దరు కాదు.. నిర్మల్ పట్టణంలో దాదాపు పురుషులతో సమానంగా మహిళలు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నరు.
::: నిర్మల్, వెలుగు
పట్టణంలో ఏ రోడ్డు పక్కన చూసినా మహిళా వ్యాపారులు కనిపిస్తున్నరు. సీజన్ వ్యాపారాలు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నరు. వేసవిలో లభించే పండ్లను గ్రామాల నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నరు. ప్రతి సీజన్‍లో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పట్టణానికి కుటుంబాలతో సహా వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నరు చాలా మంది. కొన్ని చోట్ల కుటుంబ సభ్యుల సహకారంతో.. మరికొన్ని చోట్ల తమంతట తాముగా మహిళలు బిజినెస్ చేస్తున్నరు.
కీరదోస నుంచి
జ్యూస్ సెంటర్ వరకు..
వేసవి వచ్చిందంటే చాలు పండ్లు, జ్యూస్‍లు, కూల్‍డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటారు జనాలు. దీంతో ఈ వ్యాపారాలు జోరుగా సాగుతాయి. దోసకాయలు, పనసపండ్లు, ఖర్బూజ, కొబ్బరి బోండాలు, నిమ్మకాయలు, సోడా బండ్లు, జ్యూస్ సెంటర్లకు ఫుల్ గిరాకీ ఉంటుంది. ఆ వ్యాపారాలన్నీ మగవాళ్లతో పోటీగా మహిళలు నడుపుతున్నారు. వీటితో పాటు క్యాప్‍లు, కూలింగ్ గ్లాసులు, గొడుగులు కూడా అమ్ముతున్నారు. పట్టణంలోని కొన్ని చోట్ల మహారాష్ట్రకు చెందిన మహిళలు రోడ్లపై కూర్చొని కళ్లద్దాలు విక్రయిస్తున్నారు.
ఎండాకాలం వస్తాం..
ప్రతి ఎండాకాలంలో దోసకాయలు అమ్మేందుకు ఇక్కడకొస్తాం. ఎన్నో సంవత్సరాలుగా ఇదే పని. ఎంత ఎండకొట్టినా వ్యాపారం చేసుకోవాల్సిందే. చిన్న పిల్లలను ఇంట్లో వదిలి.. నేను, నా భర్త ఇద్దరం వ్యాపారానికి వస్తాం. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎండలోనే పని చేసుకోవాలి.
–సోని, నర్సాపూర్
ఈ ఫొటోలో కొబ్బరి బోండాం కొడుతున్న మహిళ పేరు సుశీల. ఇచ్చోడ గ్రామానికి చెందిన ఈమె పదేళ్లుగా ఇదే వ్యాపారం చేస్తోంది. మొదట్లో పట్టణంలోని ఈద్గా చౌరస్తా దగ్గర టీ కొట్టు నడిపేది. అదే టైంలో ఆమె టీ కొట్టు పక్కనే ఆంధ్రాకు చెందిన వ్యాపారులు మొసంబీ జ్యూస్ చేసేవాళ్లు. వాళ్లను చూసి ఆ వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకుంది. దీంతో టీ కొట్టు వదిలి మూడేళ్లుగా మొసంబీ పండ్ల వ్యాపారం చేసింది. ఆ తర్వాత అదే ఆంధ్రా వ్యాపారుల దగ్గర కొబ్బరి బోండాలు కొట్టడం నేర్చుకుంది. అలా ఆమె పట్టణంలో మొట్ట మొదటిసారిగా కొబ్బరి బోండాల వ్యాపారం చేసిన మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కలెక్టరేట్ రోడ్డు పక్కన బండి పెట్టుకొని వ్యాపారం చేస్తుంది. ప్రతి రోజు వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తుంది. ఈ సుశీలే కాదు.. బస్టాండ్ నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు దాదాపు 30 మంది మహిళలు కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తున్నారు.
మనవరాలితో కలిసి..
మాది గుంటూరు జిల్లా చెప్పోలు గ్రామం. నా భర్తతో కలిసి నాలుగేళ్ల క్రితం నిర్మల్ వచ్చాం. రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన రోడ్డుపై సోడా బండి, కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తున్నాం. నా భర్త ఆరోగ్యం బాగోకపోవడంతో వ్యాపారంలో నా మనవరాలు సాయం చేస్తోంది. వేసవికాలం కావడంతో ప్రస్తుతం గిరాకీ మంచిగానే ఉంది. ప్రతి రోజు ఐదు వందల రూపాయల వరకు సంపాదిస్తాం.
– సంపూర్ణ