మేడ్చల్ ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు పడ్డారు

మేడ్చల్ ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు పడ్డారు
  • ఎక్సైజ్ కానిస్టేబుల్ అప్రమత్తతో పారిపోయిన దొంగలు
  • ఒకరి అరెస్ట్...పరారీలో ముగ్గురు 

మేడ్చల్ పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనానికి దుండగలు ప్రయత్నించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ అప్రమత్తంగా వ్యవహరించడంతో దొంగలు పారిపోయారు. మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పట్టణంలోని మెయిన్ రోడ్డుపై ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు దొంగతనం చేసేందుకు బుధవారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు మారుతీ సుజుకీ వ్యాన్ లో వచ్చారు. ముందుగా ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాలకు దొంగలు ఫామ్ స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎం మెషీన్ ను గ్యాస్ కట్టర్లతో కట్ చేసేందుకు ప్రయత్నించగా.. ఒక లేయర్ మాత్రమే కట్ అయ్యింది.

అప్పుడు అటుగా వెళ్తున్న మేడ్చల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఏటీఎంలో నుండి పొగ రావడం గమనించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో తక్షణమే స్పందించిన మేడ్చల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంతలోనే ముగ్గురు దొంగలు పారిపోయారు. ఒక వ్యక్తి మాత్రం పోలీసులకు పట్టుబడ్డాడు. ఈఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ సీఐ రాజశేఖరరెడ్డి తెలిపారు.