నాగోల్లోని జువెల్లరీ షాపులో కాల్పులు..బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

నాగోల్లోని జువెల్లరీ షాపులో కాల్పులు..బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

నాగోల్ స్నేహపురి కాలనీలోని ఒక బంగారం షాపులో  కాల్పుల ఘటన కలకలం రేపింది.  నలుగురు దుండగులు కాల్పులు జరిపి ..  మహాదేవ్ జువెల్లర్స్​ దుకాణం యజమాని కళ్యాణ్ చౌదరిని బెదిరించి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. కాల్పుల్లో యజమాని కళ్యాణ్ చౌదరితో పాటు షాపు వర్కర్​ సుఖ్​ రాంకు తీవ్ర గాయాలైనట్లు గుర్తించారు.  పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.  సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు, ఘటనా స్థలంలో లభ్యమైన సాక్ష్యాల ఆధారంగా విచారణ చేస్తున్నారు.   

జువెల్లరీ షాపు యజమాని కళ్యాణ్ చౌదరికి ఒక బుల్లెట్​, షాపు వర్కర్ సుఖ్ రాంకు మూడు బులెట్లు  తగిలినట్లు సమాచారం. గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. గాయపడ్డ ఇద్దరిలో ఒకరి తలకు బలమైన గాయం కావడం తో ఎంఆర్ఐ స్కానింగ్ కు వైద్యులు తరలించారు. 

మొత్తం  రెండు బైక్ లపై నలుగురు వచ్చి ఈ కాల్పులు జరిపినట్లు సమాచారం. జువెల్లరీ షాపు వర్కర్ సుఖ్​ రాం సికింద్రాబాద్ నుంచి గోల్డ్ తీసుకొచ్చిన  కొద్ది సేపటికే కాల్పులు జరిగాయని అంటున్నారు. సుఖ్ రాం ను దుండగులు సికింద్రాబాద్ నుంచే ఫాలో అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని రాచకొండ జాయింట్ సీపీ సుధీర్ బాబు సందర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.

కంట్రీ మేడ్​ పిస్టల్ తో దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఇది రాజస్థాన్ ,హర్యానా,యూపీ గ్యాంగ్  పనే అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.  పోలీసుల క్లూస్​ టీమ్​ ఘటనా స్థలంలో రెండు బుల్లెట్​ కేస్ లు స్వాధీనం చేసుకుంది.