జీఎస్టీ పేరిట వేల కోట్ల దోపిడీ

జీఎస్టీ పేరిట వేల కోట్ల దోపిడీ
  •     దొంగ ట్యాక్స్​ ఇన్వాయిస్​లతో ఐటీసీ క్లెయిమ్​లు.. ఎక్సైజ్​లో వ్యాట్​ ఎగవేతలు
  •     గత బీఆర్ఎస్​ సర్కారు హయాంలో జరిగిన అక్రమాలపై  సర్కారు నజర్​
  •     మాజీ సీఎస్​, రాజ్యసభ మాజీ ఎంపీ, మాజీ మంత్రికి లింక్​
  •     ప్రిలిమినరీ ఎంక్వైరీలో నిర్ధారణ.. చర్యలకు ప్రభుత్వం రెడీ

హైదరాబాద్​, వెలుగు:  జీఎస్టీ, వ్యాట్ చెల్లింపుల్లో జరిగిన అక్రమాల్లో వేల కోట్ల రూపాయలు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనే దానిపై రాష్ట్ర సర్కారు​ ఎంక్వైరీని స్పీడప్​ చేసింది. గత సర్కారు హయాంలో రాష్ట్ర ఖజానాలో ఉండాల్సిన సొమ్మును అక్రమ మార్గంలో కొల్లగొట్టిన వారిపై చర్యలకు సిద్ధమవుతోంది. 

జీఎస్టీలో దొంగ ట్యాక్స్​ ఇన్వాయిస్​లతో ఐటీసీ (ఇన్ పుట్​ ట్యాక్స్​ క్రెడిట్)  క్లెయిమ్ లు,  ఎక్సైజ్​లో వ్యాట్​ ఎగవేతలపై ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి కాగా.. అవకతవకలకు పాల్పడిన వారిపై ఆధారాలతో సహా కేసులు బుక్​ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. జీఎస్టీ, ఎక్సైజ్​ వ్యాట్​ అక్రమాల్లో మాజీ సీఎస్​తో పాటు రాజ్యసభ  మాజీ ఎంపీ, అప్పటి సీఎంవోలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి ఉన్నట్టు ప్రిలిమినరీ ఎంక్వైరీలో వెల్లడి కాగా .. క్విడ్​ ప్రో కో విధానంలో ఈ వ్యవహారం నడిచినట్టు తెలిసింది. గడిచిన ఐదేండ్ల లెక్కలు చూస్తుంటే.. అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు అటు.. ఇటు చేశారనేది కూడా అంతు చిక్కడం లేదని ఉన్నతాధికారి ఒకరు 'వెలుగు'కు తెలిపారు. 

జీఎస్టీలో అంతా గోల్​మాల్​

అటు జీఎస్టీ.. ఇటు వ్యాట్.. రెండింటిలోనూ వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరకుండా చేయడంలో గత బీఆర్ఎస్​ సర్కారులోని ముఖ్యులు సక్సెస్​ అయినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించారు.  జీఎస్టీలో దొంగ ట్యాక్స్​ఇన్వాయిస్​లను సృష్టించి.. ఇన్ పుట్​ ట్యాక్స్​ క్రెడిట్​ను క్లెయిమ్ చేసుకోవడం ద్వారా రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని అక్రమార్కులు కొల్లగొట్టారు. తెలంగాణలోని కొందరు డీలర్లు ఇతర రాష్ట్రాల వారికి వస్తువులు విక్రయించినట్టు దొంగ ట్యాక్స్​ ఇన్వాయిస్​లను సృష్టించి ఈ తతంగం నడిపినట్టు గుర్తించారు. ఇందులో ఎలాంటి వస్తు విక్రయాలు, రవాణా జరగకపోయినా.. జరిగినట్టు చూపించి ఇతర రాష్ట్రాల డీలర్లకు  పంపారు. ఆ డీలర్లు జీఎస్టీ నుంచి ఇన్​పుట్​ ట్యాక్స్​ క్రెడిట్​ను క్లెయిమ్​ చేసుకుంటూ వచ్చారు. అలా వచ్చిన సొమ్మును ఇతర రాష్ట్రాల డీలర్లు, తెలంగాణ డీలర్లు  పంచుకున్నారు. ఇదంతా అప్పట్లో సీఎస్ గా ఉన్న అధికారి కనుసన్నల్లోనే జరిగినట్టు తేలింది. 

తప్పుడు ఇన్వాయిస్​లు అని తెలిసినా కూడా ఆ ఆఫీసర్ పట్టించుకోకుండా ఇన్​పుట్​ట్యాక్స్​ క్రెడిట్​కు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. గత ప్రభుత్వంలో సీఎంకు దగ్గరగా ఉండే ఓ రాజ్యసభ మాజీ ఎంపీ ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లుగా ఉండాలని ఆ ఆఫీసర్​కు స్పష్టం చేయడంతో సైలెంట్​గా పనికానిచ్చేశారు. గడిచిన మూడేండ్ల లెక్కలు తీస్తే  ఇలా కొల్లగొట్టిన సొమ్ము రూ.2 వేల కోట్లపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జీఎస్టీలో జరిగే ట్రాన్సాక్షన్స్, పన్ను ఎగవేతలు, బకాయిలు వంటివాటిని గుర్తించడానికి  కమర్షియల్​ ట్యాక్స్​ శాఖ  ఒక ప్రైవేటు సంస్థతో సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ను అభివృద్ధి చేయించింది. అయితే, ఈ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌లో రాష్ట్ర వస్తు సేవల పన్ను (ఎస్‌‌‌‌జీఎస్టీ), కేంద్ర వస్తు సేవల పన్ను(సీజీఎస్టీ) రిటర్నులను గుర్తించే మాడ్యూల్స్‌‌‌‌ను మాత్రమే సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌లో పొందుపర్చారు. ఐజీఎస్టీకి సంబంధించిన మాడ్యూల్‌‌‌‌ను  లేకుండా చేయడంతో ఇక్కడి డీలర్లు పన్ను సంబంధిత రిటర్నులను దాఖలు చేశారా? లేదా? అన్నది సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ గుర్తించడం లేదు. దీంతో దొంగ ఇన్వాయిస్‌‌‌‌లతో ఐటీసీని కొల్లగొట్టినట్టు తేలింది. ఈ  కొల్లగొట్టిన సొమ్ము ఎవరెవరి ఖాతాలకు మళ్లిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

ఎక్సైజ్​ వ్యాట్​లో ఇట్లా

ప్రతి వైన్స్​, బార్​ లైసెన్స్‌‌‌‌దారు మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్‌‌‌‌ చెల్లించాలి. ప్రతి దుకాణాదారు తెలంగాణ బేవరేజెస్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ గోదాముల నుంచే మద్యాన్ని తీసుకోవాలి. ఆ మద్యం విలువపై వ్యాట్‌‌‌‌ చెల్లించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రానికి విదేశీ మద్యం దిగుమతి చేసుకుంటే అది నేరుగా బీసీఎల్​ గోదాములకు రావాల్సి ఉంటుంది. అక్కడ సాధారణంగా వేసే ఎక్సైజ్​ వ్యాట్​కు అదనంగా 70 శాతం సొమ్మును వ్యాట్​ కింద వసూలు చేయాలి. అయితే, దీనిని గత ప్రభుత్వంలో పట్టించుకోలేదు. ఫలితంగా రాష్ట్ర ఖజానా ప్రతినెలా వందల కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈ సొమ్మంతా  గత ప్రభుత్వంలోని మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ ఎంపీ,  అప్పట్లో సీఎంవోలో పనిచేసిన ఓ ఉన్నతాధికారికి ప్రతినెలా వాటాల రూపంలో అందినట్టు  ప్రాథమికంగా వెల్లడైంది. ఈ నేపథ్యంలో గత ఐదేండ్లలో విదేశీ మద్యం ఎంత అమ్మారు ? వాటి విలువ ఎంత? ప్రభుత్వానికి ఎంత వ్యాట్​ అందింది ? అనేదానిపై అధికారులు పూర్తిస్థాయి వివరాలను సేకరిస్తున్నారు. ఎక్కువ విదేశీ మద్యం అమ్మిన వాళ్ల బ్యాంకు ఖాతాలు పరిశీలించి.. వారి నుంచి డబ్బు ఎవరికి మళ్లిందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో  ప్రభుత్వ సొమ్మును అక్రమమార్గంలో తీసుకున్నందుకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం లీగల్​ఒపీనియన్లను తీసుకుంటున్నది. మరింత లోతుగా విచారణ చేయడం ద్వారా బాధ్యులపై ఆధారాలతో సహా కఠిన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని సర్కారు భావిస్తోంది.