
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై అద్భుత విజయం తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రారంభంలోనే టీమిండియాకు షాక్ తగిలింది. 11 పరుగుల వద్ద రాహుల్ (9) వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలిస్తున్నారు. ప్రధానంగా రోహిత్ బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 36 బంతులను ఆడిన రోహిత్ 52 పరుగులు చేశాడు. అదే జోరు కొనసాగిస్తాడని భావించారు.
భారత జట్టు స్కోరు 84 పరుగుల వద్ద ఉండగా రోహిత్ (53) ఔట్ అయ్యాడు. మరోవైపు కోహ్లీ సింగిల్స్ తీస్తూ.. జట్టు స్కోరును పెంచేందుకు కృషి చేస్తున్నాడు. కోహ్లీకి జతగా సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 13.4 ఓవర్ల సమయానికి టీమిండియా స్కోరు 2 వికెట్ల నష్టానికి 104 పరుగులుగా ఉంది. చిన్న జట్టు కావడంతో ఇండియాకు పెద్దగా సవాల్ ఎదురయ్యే అవకాశం కనిపించడం లేదు. ముందుగా బ్యాటింగ్ చేస్తే భారీ టార్గెట్ నిర్దేశించాలని రోహిత్ సేన భావిస్తోంది. తదుపరి పోరులో పెద్ద జట్టు సౌతాఫ్రికాను ఇండియా ఎదుర్కోనుంది. ఆ మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికలో ముందుకెళ్లేందుకు కీలకం కానుంది.