IND vs ENG 3rd Test: సర్ఫరాజ్ రనౌట్.. రోహిత్ ఆగ్రహం

IND vs ENG 3rd Test: సర్ఫరాజ్ రనౌట్.. రోహిత్ ఆగ్రహం

భారత జట్టులో చోటు కోసం ఎంతోకాలంగా ఎదురు చూసిన సర్ఫరాజ్ ఎట్టకేలకు రాజ్ కోట్ వేదికగా తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. రోహిత్ శర్మ ఔట్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సర్ఫరాజ్ ప్రారంభం నుంచే వేగంగా ఆడటం మొదలు పెట్టాడు. ఆడుతుంది తొలి టెస్ట్ అయినా అనుభవం ఉన్న బ్యాటర్ లా ఆడాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సర్ఫరాజ్ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. 

సర్ఫరాజ్ జోరు చూస్తుంటే ఈజీగా టెస్టుల్లో తన తొలి సెంచరీ మార్క్ పూర్తి చేసుకునేలా కనిపించాడు. అయితే ఈ దశలోనే దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. మార్క్ వుడ్ వేసిన 85 ఓవర్ 5 వ బంతిని జడేజా మిడాన్ మీదుగా ఆడాడు. అప్పటికి 99 పరుగులతో క్రీజ్ లో ఉన్న జడేజా సింగిల్ కోసం కాల్ ఇచ్చాడు. అయితే వెంటనే వద్దు అని చెప్పడంతో అప్పటికే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో క్రీజ్ దాటేసిన సర్ఫరాజ్.. మార్క్ వుడ్ అద్భుత త్రో కారణంగా రనౌటయ్యాడు. అప్పటివరకు బాగా ఆడుతున్న సర్ఫరాజ్ ఔట్ అందరికి బాధ కలిగించింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే అసహనానికి గురయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్ దగ్గర తన క్యాప్ విసిరి కొట్టి గట్టిగా అరిచాడు. హిట్ మ్యాన్ కోపం ఎవరిమీదో తెలియదు గాని ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. సహజంగా కోపానికి దూరంగా ఉండే రోహిత్ శర్మ ఇలా చేయడం ఆశ్చర్యకరంగా అనిపించింది. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. జడేజా (110), కుల్దీప్ యాదవ్ క్రీజ్ లో ఉన్నారు. రోహిత్ శర్మ 132 పరుగులు చేసి భారత్ భారీ స్కోర్ చేయడంలో కెలక పాత్ర పోషించాడు.