సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఇవాళ కోర్టులో విచారణ

సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఇవాళ కోర్టులో విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ పై రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. నవంబర్ 26న 3 వేల పేజీలతో  అధికారులు మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సమీర్ మహేంద్రు సహా ఆయనకు చెందిన నాలుగు కంపెనీలపై మనీ లాండరింగ్ ఆరోపణలతో చార్జిషీట్ దాఖలైంది. ఇందులో ప్రముఖ లిక్కర్ వ్యాపారి, ఇండోస్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు పేరును ఏ1గా  చేర్చారు. ఏ2, ఏ3, ఏ4, ఏ5గా పలు కంపెనీల పేర్లను పేర్కొన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ 45 కింద సమీర్ మహేంద్రుతో పాటు మరో ఇద్దరి పేర్లను చార్జ్ షీట్‌‌లో పొందుపరిచినట్లు ఈడీ తరపు న్యాయవాది నవీన్ కుమార్ తెలిపారు. 

ఇందుకు సంబంధించిన హార్డ్ డిస్క్‌‌‌‌‌‌‌‌ను ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించినట్లు చెప్పారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిపై సప్లిమెంటరీ చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్స్ ఉన్నాయని బెంచ్‌‌‌‌‌‌‌‌కు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నదని, సప్లిమెంటరీ చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్ దాఖలు చేస్తామని వివరించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న సమీర్ మహేంద్రు తరపు న్యాయవాది..ఇప్పటికే అన్ని వివరాలను ఈడీకి సమర్పించినట్లు బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాగ్ పాల్.. డాక్యుమెంట్ల సంఖ్య ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కేసును డిసెంబర్ 12కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్ట్ చేసిన తొలి వ్యక్తి సమీర్ మహేంద్రునే. సెప్టెంబర్ 27న మనీ లాండరింగ్ కేసులో సమీర్ మహేంద్రుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు తర్వాత 60 రోజుల చట్టబద్ధమైన గడువు ముగియడంతో ఈడీ చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్ దాఖలు చేసింది.