రామ మందిర భూమి పూజకు ప్రధానిని పిలవడంపై రాద్ధాంతం అనవసరం

రామ మందిర భూమి పూజకు ప్రధానిని పిలవడంపై రాద్ధాంతం అనవసరం

విశ్వ హిందూ పరిషత్

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం వచ్చే నెల 5న వైభవంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్‌కు ప్రధాని మోడీని ఆహ్వానించడంపై కాంగ్రెస్, ఎన్సీపీ విమర్శలు చేశాయి. దీనిపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) స్పందించింది. మోడీకి శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్‌ ఇన్విటేషన్‌ ఇవ్వడాన్ని వీహెచ్‌పీ సమర్థించింది. వీహెచ్‌పీ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆర్‌‌ఎస్ఎస్‌ సభ్యుడు కూడా అయిన అలోక్‌ కుమార్ ఈ విషయంపై పలు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇంకా ధృవీకరించనందున దీనిపై వివాదం అనవసరం అన్నారు.

‘కార్యక్రమంలో ఎవరు పాల్గొంటారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈవెంట్‌కు హాజరయ్యే వారి పేర్లను ఏకగ్రీవంగా నిర్ణయించిన తర్వాత వారికి ట్రస్ట్‌ తరఫున ఇన్విటేషన్స్ పంపాం. ఏ మతాన్ని కూడా దేశం తక్కువ చేసి చూడకుండా, అన్నింటినీ సమానంగా చూడటమే సెక్యూలరిజం అన్నదే మా ఉద్దేశం. సోమ్‌నాథ్ ఆలయ ప్రారంభోత్సవానికి హాజరవ్వడానికి మాజీ పీఎం నెహ్రూ నిరాకరించరన్నది అర్ధ సత్యమే. అలాగే ఈ ప్రారంభోత్సవానికి హాజరైన అప్పటి రాష్ట్రపతి డా.రాజేంద్ర ప్రసాద్‌కు ఓ సెక్యూలర్ దేశ రాష్ట్రపతి టెంపుల్ ఫంక్షన్స్‌కు హాజరవ్వొద్దని నెహ్రూ లేఖ పంపిన విషయాన్ని గుర్తు చేశారు. నెహ్రూ లెటర్‌‌పై స్పందనగా రాజీనామాకు రాజేంద్ర ప్రసాద్ సిద్ధమయ్యారు. అయితే నెహ్రూ ఈ సమస్యను కొనసాగించలేదు’ అని అలోక్‌ పేర్కొన్నారు.