బుల్లెట్‌‌ రాజా నెం.3.. ఆడి, ఫెరారీని నెట్టి.. మూడో అత్యంత శక్తివంతమైన ఆటో బ్రాండ్‌‌గా రాయల్‌‌ ఎన్‌‌ఫీల్డ్‌‌

బుల్లెట్‌‌ రాజా నెం.3.. ఆడి, ఫెరారీని నెట్టి.. మూడో అత్యంత శక్తివంతమైన ఆటో బ్రాండ్‌‌గా రాయల్‌‌ ఎన్‌‌ఫీల్డ్‌‌
  • ఐదో ప్లేస్‌‌లో టాటా మోటార్స్‌‌.. టాప్‌‌ 50 లో మహీంద్రా, మారుతీ

న్యూఢిల్లీ: మోటార్‌‌సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌‌ఫీల్డ్ ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తివంతమైన ఆటోమోటివ్ బ్రాండ్‌‌గా నిలిచింది. బ్రాండ్ ఫైనాన్స్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ 2026 రిపోర్ట్ ప్రకారం, గ్లోబల్ కంపెనీలైన ఆడి,  ఫెరారీ వంటి సంస్థలను రాయల్ ఎన్‌‌ఫీల్డ్ వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది. భారత ఆటోమొబైల్ రంగానికి ఇది గర్వకారణమని  ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి.  

 ఈ రిపోర్ట్ ప్రకారం,  లిస్టులో  టయోటా మొదటి ప్లేస్‌‌లో ఉంది. బీఎండబ్ల్యూ రెండో స్థానంలో,  రాయల్ ఎన్‌‌ఫీల్డ్ మూడవ స్థానంలో ఉన్నాయి.  రాయల్ ఎన్‌‌ఫీల్డ్ బ్రాండ్ విలువ ఏడాది లెక్కన 30 శాతం పెరిగి 1.2 బిలియన్ డాలర్ల (రూ.11,300 కోట్ల) కు చేరింది. బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్‌‌లో 100కి గానూ 88.9 స్కోరుతో ఏఏఏ రేటింగ్‌‌ను పొందింది.  ఈ రిపోర్ట్‌‌లో  టాటా మోటార్స్ 5వ స్థానంలో నిలవగా, మహీంద్రా 25వ స్థానంలో, మారుతీ సుజుకీ 34వ స్థానంలో నిలిచాయి.

గ్లోబల్‌‌ విస్తరణ..

రాయల్‌‌ ఎన్‌‌ఫీల్డ్‌‌ 80 కి పైగా దేశాల్లో 3,200 రిటైల్ ఔట్‌‌లెట్లను నిర్వహిస్తోంది. గ్లోబల్‌‌గా బిజినెస్‌‌ను విస్తరిస్తోంది. ఈ బ్రాండ్‌‌కు యూరప్‌‌, సౌత్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆస్ట్రేలియాలో మంచి డిమాండ్ ఉంది.  అంతర్జాతీయ మార్కెట్లలో ఏడు అసెంబ్లీ ప్లాంట్లను కలిగి ఉంది. మిడ్-సైజ్ (250సీసీ పైన) మోటార్‌‌సైకిల్ విభాగంలో కంపెనీ తిరుగులేని పట్టు సాధించింది. హంటర్ 350, సూపర్ మెటోర్ 650, అడ్వెంచర్ విభాగంలో హిమాలయన్ 450 వంటి మోడళ్లు రైడర్లను ఆకట్టుకుంటున్నాయి.