తారక్, చెర్రీ ఫ్యాన్స్‌‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్

తారక్, చెర్రీ ఫ్యాన్స్‌‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్

హైదరాబాద్: ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రేజీ మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఫ్యాన్స్‌‌కు సినిమా టీమ్ అతిపెద్ద అప్‌‌డేట్ ఇచ్చింది. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్‌‌ విడుదల కానుంది. ‘నీరు-అగ్నిల ప్రవాహ బలానికి ఈ అక్టోబర్ 13వ తేదీ వేదిక కానుంది. భారత సినీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఎప్పటికీ గుర్తుండిపోయే ఎక్స్‌పీరియన్స్‌‌ను ఈ ఫిల్మ్ అందించనుంది. రైడ్ మొదలైంది’ అని మూవీ టీమ్ ట్వీట్ చేసింది.

రిలీజ్ డేట్‌‌తోపాటు సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌‌చరణ్ గుర్రంపై, కొమురం భీమ్‌‌గా యాక్ట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ బైక్‌పై ఉన్న ఫొటోను షేర్ చేసింది. టాలీవుడ్ దిగ్దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్‌‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. భారత స్వాతంత్ర్యానికి ముందు 1920వ సంవత్సరంలో జరిగే కథగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అలియా భట్, అజయ్ దేవగణ్ లాంటి బాలీవుడ్ ప్రముఖ నటులతోపాటు రీసెంట్‌‌గా క్రాక్ మూవీతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించిన సముద్ర ఖని ఆర్ఆర్ఆర్‌‌లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.