
- డబ్బులు పోగొట్టుకున్న ఖమ్మం జిల్లా కారేపల్లి గోల్డ్ వ్యాపారి
కారేపల్లి, వెలుగు: తక్కువ ధరకే గోల్డ్ ఇస్తామని నమ్మించగా.. ఓ వ్యాపారి రూ. లక్షల్లో మోసపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. కారేపల్లి బస్టాండ్ సెంటర్ కు చెందిన ఓ గోల్డ్ వ్యాపారికి ఏపీలోని ఏలూరు నుంచి వారం రోజులుగా ఓ వ్యక్తి తరచూ ఫోన్ చేశాడు. తక్కువ ధరకే గోల్డ్ ఇస్తానని 20 తులాలు రూ.10 లక్షలకే వస్తుందని నమ్మించాడు. దీంతో ఆశపడిన కారేపల్లికి చెందిన వ్యాపారి జగ్గయ్యపేటలో గోల్డ్ షాపులో పనిచేసే తన బంధువును తీసుకుని ఏలూరు వెళ్లాడు. ఫోన్ చేసిన అడ్రస్ కు వెళ్లారు. అక్కడ గోల్డ్ ను చూపించగా నిజమైనదేనని నిర్ధారించుని.. రూ.10 లక్షలు ఇవ్వగా.. అవతలి వ్యక్తి గోల్డ్ ను సూట్ కేసులో పెట్టి ఇచ్చాడు. డబ్బు ముట్టిన తర్వాత పోలీసులు వస్తున్నారని హడావుడి చేసి బ్రీఫ్ కేసును మార్చారు. ఇంటికి వెళ్లిన తర్వాత చూసుకుంటే నకిలీ గోల్డ్ ఉంది. మోసపోయానని తెలుసుకుని బాధిత కారేపల్లి వ్యాపారి ఫ్రెండ్స్ వద్ద వాపోయాడు.