గ్రామ పంచాయతీలకు వెయ్యి కోట్ల నిధులు

గ్రామ పంచాయతీలకు వెయ్యి కోట్ల నిధులు
  • చెక్ పవర్ లేక ఆగిన ఆర్థిక సంఘం నిధులు రూ.536 కోట్లు
  • పంచాయతీల్లో పన్నుల వసూళ్లు రూ.338 కోట్లు
  • ఇన్నాళ్లూ జిల్లా ఖజానాలకే పరిమితమైన ఫండ్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనున్నాయి. గ్రామాలకు త్వరలో వెయ్యి కోట్ల రూపాయల వరకూ నిధులు విడుదల కానున్నాయి. చెక్ పవర్ అంశంపై ఇంత కాలం రాష్ట్ర సర్కారు నిర్ణయం చెప్పకపోవటంతో జిల్లా ఖజనాలో నిధులు నిలిచిపోయాయి. సర్పంచ్, ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో నిధులు రిలీజ్​ కానున్నాయి. ఇటీవల 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర వాటాగా రూ.536 కోట్లు విడుదలయ్యాయి. ఇవే కాక పంచాయతీల నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.338 కోట్ల పన్నులు వసూలయ్యాయి. త్వరలో జనాభా ఆధారంగా గ్రామాలకు ఈ నిధులను విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఏడాది నుంచి ఆగిన అభివృద్ధి

రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పదవీకాలం 2018 ఆగస్టు 1తో ముగిసింది. ఆ తర్వాత ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. అప్పటివరకు రాష్ట్రంలో 8,371 గ్రామ పంచాయతీలు ఉండగా.. 500 జనాభా దాటిన తండాలు, గ్రామాలను కూడా పంచాయతీలుగా మార్చడంతో వీటి సంఖ్య సుమారు 13 వేలకు చేరింది. జనవరిలో పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. ఫిబ్రవరి 2 నుంచి కొత్త పాలక వర్గాలు ఏర్పడ్డాయి. చెక్ పవర్ పై ప్రభుత్వ నిర్ణయం వెల్లడి కాకపోవటంతో నాలుగు నెలలుగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. వేసవిలో నీటి సరఫరా, మోటార్ల మరమ్మతులు, పారిశుధ్యం వంటి వాటికి పలు చోట్ల సర్పంచ్ లే సొంత నిధులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.

రికార్డు స్థాయిలో పన్నుల వసూలు

పంచాయతీ, పరిషత్ ఎన్నికల నేపథ్యంలో రికార్డు స్థాయిలో పన్నులు వసూలయ్యాయి. పన్ను బకాయిలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులని ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో పన్నులు చెల్లింపు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.391 కోట్లకుగానూ రూ.338 కోట్ల(86.46%) పన్నులు వసూలయ్యాయి. మొత్తం పన్నులలో 86.46 మాత్రం వసూలయ్యాయి. పంచాయతీల్లో కార్యదర్శుల కొరతతో మిగతా టార్గెట్​ అందుకోలేకపోయామని, ఇటీవల 8,500 మందికిపైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరటంతో వచ్చే ఏడాది 100 శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు చెబుతున్నారు.

వచ్చే బడ్జెట్ లో నిధులు

వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీలకు కొంత మొత్తాన్ని కేటాయించే అవకాశాలున్నాయి . ఇవికాక రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు, కేంద్ర,రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు,ఉపాధి హామీ పనుల ద్వారా పంచాయతీలకు నిధులు రానున్నాయి . గత ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీల్లో ఎక్కువ శాతం తండాలే. వీటిలో రోడ్లు,తాగునీటి పైపులైన్ల మరమ్మతులు, నీటిట్యాంకుల శుభ్రత, పారి శుధ్యం , వీధిలైట్ల ఏర్పాటు, నిర్వహణ, ఫుట్ పాత్ లు, కల్వర్టుల నిర్మాణం మొదలైన పనులు చేసే అవకాశం ఉంది.

త్వరలో నిధుల విడుదల

సర్పంచ్ లకు చెక్ పవర్ లేక ఇన్నాళ్లూపంచాయతీలకు నిధులు విడుదల కాలేదు.ఆర్థిక సంఘం నిధులు, పంచాయతీల్లో వసూలైన పన్నులు జిల్లా ఖజానాల్లోనేఉన్నాయి. చెక్ పవర్ ఇవ్వటంతో త్వరలో జనాభా ఆధారంగా నిధుల విడుదలకుఏర్పాట్లు చేస్తున్నాం .-వికాస్ రాజ్,ముఖ్య కార్యదర్శి, పంచాయతీ రాజ్ శాఖ