స్టేడియం అభివృద్ధికి రూ.16 కోట్లు మంజూరు : ఏపీ జితేందర్ రెడ్డి

స్టేడియం అభివృద్ధికి రూ.16 కోట్లు మంజూరు : ఏపీ జితేందర్ రెడ్డి
  • రాష్ట్ర క్రీడల సలహాదారుడు ఏపీ జితేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం అభివృద్ధికి  రూ.16 కోట్లు మంజూరు అయినట్లు రాష్ట్ర క్రీడల సలహాదారుడు ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు. శనివారం పాలమూరు యూనివర్సిటీలో తోటరాజు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో 11వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్స్ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డితో కలిసి పాల్గొని క్రీడాకారులకు షీల్డ్స్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని  స్టేడియాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 465 కోట్లు మంజూరు చేశారన్నారు. 

7000 మంది క్రీడాకారులతో గచ్చిబౌలి స్టేడియంలో క్రీడలు నిర్వహిస్తామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంకు  రూ. 16.40 కోట్లు సాంక్షన్ అయ్యాయని వీటితో సింథటిక్ ట్రాక్, ఇండోర్ స్టేడియం, బాస్కెట్‌బాల్ కోర్టు నిర్మిస్తామని తెలిపారు. జిల్లాలో వాలీబాల్ అకాడమీ శాంక్షన్ అయిందని క్రీడాకారులను ప్రోత్సహించి ఒలంపిక్స్ కి వెళ్లేలా కృషి చేస్తామని అన్నారు. జిల్లా ఒలింపిక్ అధ్యక్షుడు ఎంపీ వెంకటేశ్,  పీయూ వీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు.