- మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆరోపణ
రామాయంపేట, వెలుగు: రామాయంపేట మున్సిపాలిటీలో గడిచిన ఏడాదిలో రూ.2 కోట్లకు పైగా అవినీతి, అక్రమాలు జరిగాయని మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం ఆయన స్థానిక బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 15వ ఫైనాన్స్ నిధులు పక్కదారి పట్టాయని, బ్లీచింగ్ పౌడర్, మొక్కల కొనుగోలులోనూ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. వీటితో పాటు ఇటీవల కొనుగోళ్లు చేసిన చెత్త సేకరణ వాహనాలలోనూ అక్రమాలు జరిగాయన్నారు.
ముఖ్యంగా కమిషనర్ 12 ,600 చెత్త బుట్టలు కొనుగోలు చేశామని చెబుతున్నారని, వాటికి రూ.32 లక్షల ఎంబీ రికార్డు చేశారన్నారు. గతంలో పంపిణీ చేయగా మిగిలిన బుట్టలు సైతం ఉన్నాయని వాటి లెక్కలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. వాహనాల్లో పోసిన డీజిల్ విషయంలో సైతం భారీ ఎత్తున అక్రమాలు జరిగాయన్నారు. ఇక్కడ జరిగిన అక్రమాలపై అధికారులు 10 రోజుల్లో విచారణ జరపాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
