బైకర్స్‌కి వార్నింగ్.. స్టంట్స్ చేస్తే రూ. 2 లక్షల జరిమానా

బైకర్స్‌కి వార్నింగ్.. స్టంట్స్ చేస్తే రూ. 2 లక్షల జరిమానా

బైక్‌తో స్టంట్స్ చేసే అలవాటుందా.. అయితే అది మానుకోండి. అలా స్టంట్స్ చేసేవాళ్ల కోసం బెంగళూరు పోలీసులు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. స్టంట్ చేస్తూ పట్టుబడితే రూ. 2 లక్షల వరకు జరిమానా విధించాలని నిర్ణయించారు. బెంగళూరులో బైకర్లు విన్యాసాలు ఎక్కువయ్యాయి. వాటిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే విధించే జరిమానాను పోలీసులు రూ .2 లక్షలకు పెంచారు. స్టంట్ రైడర్స్ కారణంగా పెరుగుతున్న ప్రమాదాల సమస్యపై పోలీసు కమిషనర్ కమల్ పంత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. స్టంట్స్ చేస్తూ మొదటిసారిగా పట్టుబడితే.. సెక్షన్ 107 కింద డిప్యూటీ కమిషనర్ ముందు ఒక అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. రెండోసారి పట్టుబడితే మాత్రం రూ. 2 లక్షలకు బాండ్‌పై సంతకం తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గతంలో ఇలాంటి కేసులకు 2000 రూపాయల వరకు జరిమానా విధించి.. వాహానాలను స్వాధీనం చేసుకొని.. లైసెన్స్ రద్దు చేసేవారు. బైకర్లు జరిమానాను కోర్టులో చెల్లించి తమ వాహానాలను విడిపించుకునేవారు.

అదేవిధంగా బైక్ సైలెన్సర్‌లను మార్చి శబ్ద కాలుష్యానికి పాల్పడే వాళ్లకు కూడా కొత్త రూల్ పెట్టింది. సైలెన్సర్ మార్చి పట్టుబడితే రూ. .50,000 జరిమానా విధించబడుతుందని పోలీసులు తెలిపారు. బైకులకు సైలెన్సర్‌లను మార్చే మెకానిక్ గ్యారేజ్ యజమానులకు కూడా జరిమానా విధించనున్నట్లు పోలీసులు తెలిపారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ఒక వాహనం యొక్క సైలెన్సర్ 80 డెసిబెల్ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తే అది శబ్ద కాలుష్యానికి కారణమవుతుందని భావిస్తారు.

నగర చరిత్రలో పోలీసులు మొట్టమొదటిసారిగా బైక్ స్టంట్ చేసే 28 మందిపై కేసు నమోదు చేసి, ఒక్కొక్కరి చేత రూ .2 లక్షల బాండ్‌పై సంతకం తీసుకున్నారు. అదేవిధంగా నలుగురు గ్యారేజ్ యజమానులపై కూడా సెక్షన్ 110 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదే విషయంపై ట్రాఫిక్ పోలీసు జాయింట్ కమిషనర్ రవికాంతే గౌడ మాట్లాడుతూ.. ‘పోలీసులు చేసిన ప్రత్యేక డ్రైవ్‌లో 48 స్టంట్ రైడర్లను పట్టుకున్నారు. వారిపై సెక్షన్ 279 కింద కేసు బుక్ చేశారు. వారిలో కొంతమంది రద్దీగా ఉండే ప్రదేశాలలో విన్యాసాలు చేస్తూ.. ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టినందుకు 28 మందిపై సెక్షన్ 107 కింద కేసు నమోదు చేశారు. వీరికి రూ. 2 లక్షలు జరిమానా విధించారు’అని ఆయన తెలిపారు.

For More News..

గ్యాంగ్ రేప్ శిక్షపై కర్ణాటక హైకోర్టు కీలక వాఖ్యలు

దేశంలో కొత్తగా 43,893 కరోనా కేసులు

తెలంగాణలో మరో 1,481 కరోనా కేసులు