అయిజ, వెలుగు : అయిజ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని కాంగ్రెస్రాష్ట్ర అధికార ప్రతినిధి షెక్షావలి ఆచారి తెలిపారు. మంగళవారం పట్టణంలోని పార్టీ ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మున్సిపాలిటీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్లో బీఆర్ఎస్ నాయకులు చేతివాటం చూపించారని ఆరోపించారు. అభివృద్ధి పనుల పేరుతో 8 ఏండ్లు క్రితం వేసిన శిలాఫలకాలు నేటికీ వెక్కిరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. గత పదేండ్లు ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లు అభివృద్ధి గురించి కౌన్సిల్ లో ప్రశ్నించి, ప్రజల పక్షాన పోరాటం చేస్తే కేసులు నమోదు చేశారని గుర్తుచేశారు.
మున్సిపాలిటీలోని 20 వార్డులు ఉన్నాయని, ప్రతి వార్డుకు రూ.కోటి కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆదరించాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పోతుల జనార్దన్ రెడ్డి, సంకాపూర్ రాముడు, మేకల నాగిరెడ్డి, రంగు శ్రీధర్, మధుకుమార్, జయన్న, మద్దిలేటి, సురేశ్ గౌడ్, సులోచన, రాణెమ్మ, ప్రకాశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
