రూ. 4 వేల కోట్లతో సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో.. 9 కిలోమీటర్ల పొడవైన టన్నెల్

రూ. 4 వేల కోట్లతో సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో.. 9 కిలోమీటర్ల పొడవైన టన్నెల్

మంచు కొండల్లో మహాద్భుతం

ప్రపంచంలోనే అతి పొడవైన అటల్​ టన్నెల్.. మనాలి-లేహ్‌‌ల మధ్య తగ్గనున్న దూరం

సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తు..

9.02 కిలోమీటర్ల పొడవు..

దాదాపు పదేండ్ల పాటు నిర్మాణం..

సుమారు 4,000 కోట్ల రూపాయల ఖర్చు..

మనాలీ, లేహ్​ మధ్య దూరాన్ని 46 కిలోమీటర్లు తగ్గించే మార్గం..

మొత్తంగా స్ట్రాటజికల్​గా దేశానికి కీలకమైన ప్రదేశం..

ఇదంతా.. అటల్​ టన్నెల్​ గురించే.. అసలు ఈ టన్నెల్​ స్పెషాలిటీలు ఏమిటీ? స్ట్రాటజికల్​గా మనకు ఇది ఎంత కీలకం? ప్రపంచంలోనే అతి పొడవైన ఈ సొరంగ మార్గాన్ని శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.

హిమాచల్​ ప్రదేశ్​లోని మనాలీ, లడఖ్​లోని లేహ్​ను కలిపేదే రోహ్​తంగ్​ ఏరియా. చుట్టూ మంచుకొండలతో ఉండే ఈ ప్రదేశం.. ఐదారు నెలలు మాత్రమే మామూలుగా ఉంటుంది. మిగతా టైంలో మంచులో కూరుకుపోయి ఉంటుంది. దీంతో ఇతర ప్రాంతాలతో ఇక్కడి వారికి సంబంధాలు తెగిపోయేవి. ఈ ప్రాంతాల్లోని రిమోట్​ ఏరియాలకు వెళ్లాలంటే అప్పట్లో చాలా కష్టపడాల్సి వచ్చేది. నార్మల్​రూట్​లో ప్రయాణం చేస్తే మనాలీ నుంచి లేహ్​కు చేరుకోవాలంటే 470 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఇందుకు దాదాపు 14 గంటల సమయం పట్టేది. కొండ ప్రాంతం కావడంతో అక్కడ ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అందువల్ల తక్కువ దూరమైనా ప్రయాణానికి ఎక్కువ సమయం పట్టేది. కానీ ఈ టన్నెల్​ పూర్తి కావడంతో మనాలీ, లేహ్​ మధ్య దూరం 46 కిలోమీటర్లు తగ్గనుంది. సమయం పరంగా చూస్తే ఐదారు గంటలు తగ్గనుంది.

రోహ్​తంగ్​​ నుంచి అటల్

రోహ్​తంగ్​ పాస్ వద్ద టన్నెల్​హైవే రోడ్​ను నిర్మించాలనే చరిత్రాత్మక నిర్ణయాన్ని 2000 జూన్​ 3న అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయీ తీసుకున్నారు. టన్నెల్​రూట్​ సౌత్​ పోర్టల్ ను సమీపించే హైవే నిర్మాణానికి 2002 మే 26న శంకుస్థాపన చేశారు. మొదట్లో దీనిని రోహ్​తంగ్​​ టన్నెల్​గా పిలిచేవారు. అయితే గతేడాది డిసెంబర్​లో ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్.. వాజ్​పేయీ చేసిన సేవలకు గుర్తుగా దీనికి అటల్​ టన్నెల్​గా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

పదేండ్ల కష్టమిది..

2002లో పునాది పడినా.. పూర్తి స్థాయిలో టన్నెల్​ నిర్మాణం మొదలైంది మాత్రం 2010 నుంచే. మొదట ఆరేండ్లలో అంటే 2015 నాటికి ఈ టన్నెల్​ నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేశారు. కానీ, అక్కడి వెదర్​ కండిషన్లు, ఇతర పరిస్థితుల కారణంగా నిర్మాణం పదేండ్లు పట్టింది. అయితే ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా మన ఇంజనీర్లు ఈ అద్భుతాన్ని పూర్తి చేశారు. పదేండ్లు కష్టపడి.. కొండల్ని తొలిచి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇందుకోసం బార్డర్​ రోడ్స్​ ఆర్గనైజేషన్(బీఆర్వో) ఎంతో శ్రమించింది. జియోలాజికల్, టెర్రెయిన్, వెదర్​ చాలెంజ్​లను ఎదుర్కొంది. 587 మీటర్ల సేరీ నాలా ఫాల్ట్ జోన్ కోసం వీరు ఎక్కువ శ్రమించాల్సి వచ్చింది. సొరంగంలో రెండు వైపులను కలపడానికి పడిన కష్టం 2017లో పూర్తయ్యింది. అక్కడి నుంచి చకచకా పనులు కొనసాగాయి. ఇప్పుడు అన్నీ పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

బడ్జెట్ రూ.4,000 కోట్లు

సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో నిర్మించిన హైవే మార్గాల్లో ప్రపంచంలోనే అతి పొడవైనది అటల్ టన్నెల్. దీని పొడవు 9.02 కిలోమీటర్లు. సముద్ర మట్టానికి 3,000 మీటర్లు(10,000 అడుగుల) ఎత్తులో ఇది ఉంది. అత్యాధునిక ప్రమాణాలతో ఈ టన్నెల్​ నిర్మాణం జరిగింది. దీని వల్ల మనాలీ, లేహ్​ మధ్య దూరం 46 కిలోమీటర్లు తగ్గుతుంది. అలాగే ప్రమాణ సమయం ఐదారుగంటలు ఆదా అవుతుంది. ఇది ఏడాది పొడవునా మనాలీ ని, లాహౌల్ లోయను కలిపి ఉంచుతుంది. మంచుకురవడం వల్ల గతంలో ఎదురైన ఇబ్బందులకు ఈ టన్నెల్​ నిర్మాణంతో చెక్​పడింది. రిమోట్​ ఏరియాలకు కూడా రాకపోకలు సాగించే వీలు కలిగింది. దీని నిర్మాణం పూర్తి చేసేందుకు దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యింది. అటల్ టన్నెల్​ సౌత్​ పోర్టల్  మనాలీ నుంచి 25 కిలో మీటర్ల దూరంలో సముద్రమట్టానికి 3,060 మీటర్ల ఎత్తులో ఉంది. దీని నార్త్​ పోర్టల్ లాహౌల్ లోయలోని తేలింగ్ గ్రామం వద్ద సముద్రమట్టానికి 3,071 మీటర్ల ఎత్తున ఉంది. తొలిసారిగా రోవా ఫ్లయర్​ టెక్నాలజీతో గుర్రపు నాడా ఆకారంలో 8 మీటర్ల రోడ్ వేను సింగిల్ ట్యూబ్, డబుల్ లేన్లతో నిర్మించారు. ఇరు వైపులా ఒక్కో మీటర్​ చొప్పున ఫుట్​పాత్​ ఉంటుంది.

For More News..

అధిక వడ్డీలు ఆఫర్ చేస్తున్న చిన్న బ్యాంకులు

ట్రంప్‌‌కు కరోనాతో స్టాక్ మార్కెట్లన్నీ అతలాకుతలం

అగ్రి చట్టాలపై టీఆర్​ఎస్​ అబద్ధాలను రైతులు నమ్మరు