
ప్రస్తుత రోజుల్లో సినిమా విడుదలైన గంటల్లోనే హెచ్డీ ప్రింట్స్ లీక్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ‘గేమ్ ఛేంజర్’, ‘తండేల్’, ‘కన్నప్ప’, ‘కుబేర’ సినిమాల హెచ్డీ వెర్షన్స్ విడుదలైన రోజే పైరసీ సైట్లలో దర్శనమిచ్చాయి. సినిమా యొక్క పైరేటెడ్ కాపీలు Tamilrockerz, Filmyzilla, Movierulez మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లతో సహా అన్ని అక్రమ సైట్‌లలో వస్తున్నాయి. కోట్లు పెట్టి సినిమా నిర్మిస్తే.. గంటల్లోనే పైరసీ లీక్ కావడంపై చిత్ర నిర్మాతలు భారీ నష్టాల్లో మునుగుతున్నారు. ఈ క్రమంలో పైరసీని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.
TFDC ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజు పైరసీని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గురువారం (జులై 3న) TFDC ఎండీ సీహెచ్ ప్రియాంకతో కలిసి హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నోడల్ ఏజెన్సీగా, చలన చిత్ర వాణిజ్య మండలికి చెందిన సైబర్ సెల్, పోలీసు శాఖ ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు నిర్మాత దిల్‌రాజు వెల్లడించారు.
►ALSO READ | Kannappa Box Office: కన్నప్ప మొదటి వారం బాక్సాఫీస్ అప్డేట్.. మొత్తం ఎన్ని కోట్లు వచ్చాయంటే?
పైరసీ భూతాన్ని అరికట్టేందుకు.. అవసరమైతే మరికొన్ని కొత్త నిబంధనలను తీసుకొస్తామని దిల్‌రాజు తెలిపారు. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలోని నెలకొన్న సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే, వాటి పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని TFDC ఎండీ సీహెచ్ ప్రియాంక అన్నారు.
అయితే, పైరసీ కొన్ని సంవత్సరాలుగా లేదు.. ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ ఛాంబర్, అందరూ చేసిన కృషికి తగ్గింది. కానీ.. మళ్లీ 2025 జనవరి నుంచి విచ్చలవిడిగా పైరసీ జరుగుతోందని సినీ వర్గాలు అంటున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో తెలియాల్సి ఉంది.