
- 4,674 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 49.32 కోట్లు జమ
- జిల్లాలో ఇండ్ల నిర్మాణాలు స్పీడప్
- నిర్మాణ దశల వారీగా బిల్లుల చెల్లింపు
- క్షేత్రస్థాయిలో ఇండ్లను పరిశీలిస్తున్న అధికారులు
కామారెడ్డి, వెలుగు: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 12,050 ఇండ్లలో 6,169 ఇండ్లకు మార్కవుట్ ఇవ్వగా, 5,701 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 3,895 ఇండ్లు బేస్మెంట్ స్థాయి, 1,364 ఇండ్లు రూఫ్ స్థాయి, 442 ఇండ్లు స్లాబ్ స్థాయిలో ఉన్నాయి. నిర్మాణ దశకు చేరుకున్న వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో బిల్లులు జమ చేస్తూ అధికారులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 4,674 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.49.32 కోట్లు జమయ్యాయి. దీంతో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేశారు.
బిల్లుల చెల్లింపుల దశలు..
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం విడతలవారీగా బిల్లులు చెల్లిస్తోంది. హౌసింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో నిర్మాణాలను పరిశీలించి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసి బిల్లులు పంపిస్తున్నారు. బేస్మెంట్ స్థాయికి రూ.లక్ష, రూఫ్ స్థాయికి మరో రూ.లక్ష, స్లాబ్ దశకు రూ.2 లక్షలు మంజూరవుతాయి. దీంతో స్లాబ్ కంప్లీట్ అయ్యే నాటికి రూ.4 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.
ఇండ్ల నిర్మాణాలపై ఫోకస్..
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించడంతో హౌసింగ్ పీడీ, స్పెషల్ ఆఫీసర్లు, మండల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇల్లు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇసుక సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇండ్ల నిర్మాణాల దశలను బట్టి బిల్లులు మంజూరయ్యేలా చూస్తున్నారు. బిల్లులు సకాలంలో జమ కావడంతో లబ్ధిదారులు నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు.
ఇబ్బందులు లేకుండా చర్యలు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇసుక సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా చూస్తున్నాం. పంట పొలాల్లోని ఇసుక మేటలను ఉపాధి హామీ కూలీలతో తొలగిస్తూ, లబ్ధిదారులకు ఇసుక కేటాయిస్తున్నాం. నిర్మాణ బిల్లులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమ అవుతున్నాయి.
ఆశిష్ సంగ్వాన్, కామారెడ్డి కలెక్టర్
ఇంటి దశ లబ్ధిదారుల అమౌంట్
సంఖ్య రూ. కోట్లలో
బెస్మిట్ లేవల్ 3,518 35.18
రూప్ లేవల్ 898 8.98
స్లాబ్ 258 5.16