
- ప్రమాదం తీరుపై అనుమానాలు
పెబ్బేరు, వెలుగు : ఓ రైస్ మిల్లులో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని రూ. కోట్ల విలువైన బియ్యం, గన్నీ బ్యాగులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ శివారులోని సాయిగోపాల్ పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... సోమవారం సాయంత్రం రైస్ మిల్లులో పనిచేసే వర్కర్లు టీ తాగేందుకు బయటకు వెళ్లారు. వారు వచ్చే సరికి మిల్లులో పెద్ద ఎత్తున మంటలు లేచాయి. దీంతో వెంటనే ఓనర్లకు, ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు.
కొత్తకోట, వనపర్తికి చెందిన ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. ప్రమాదంలో రూ. 5 కోట్ల విలువైన బియ్యం, గన్నీ బ్యాగులు కాలిపోయాయని సమాచారం. విషయం తెలుసుకున్న పెబ్బేరు పోలీసులు మిల్ వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. రైస్ మిల్లులో రెండు రోజులుగా వెల్డింగ్, డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయని, ఈ క్రమంలో నిప్పు రవ్వలు గన్నీ బ్యాగులపై పడి మంటలు లేచి ఉంటాయని అనుమానిస్తున్నారు.
అయితే సాయి గోపాల్ రైస్ మిల్ ఓనర్లు ప్రభుత్వానికి కోట్లాది రూపాయల బకాయిలు ఉండడంతో కొన్ని రోజులుగా టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు దాడులు చేస్తున్నారు. ఇదే సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ప్రమాదవశాత్తు జరిగిందా ? లేక కావాలనే చేశారా ? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.