
జైపూర్‌లోని పలు ప్రైవేట్ లాకర్లలో భారీగా నల్లధనం భద్రపరచబడిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ కిరోడి మీనా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. జైపూర్‌లోని 100 ప్రైవేట్ లాకర్లలో రూ. 5వందల కోట్ల నల్లధనం, 50 కిలోల బంగారం భద్రపరచబడిందని ఆయన ఆరోపించారు. మీనా చేసిన ఆరోపణలపై తాజాగా స్పందించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం, కిరోడీ మీనా కుమ్మక్కయ్యారని అన్నారు.
వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం కిరోడీ ఒక సంస్థ కార్యాలయానికి వెళ్లారు. లాకర్లు ఇక్కడే సంస్థలో ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని పరిశీలించేందుకు ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందాలు సంస్థకు చేరుకున్నాయని కూడా మీనా తెలిపారు. అయితే, ఈ రెండు ఏజెన్సీల నుంచి మాత్రం ఎలాంటి ధృవీకరణ లేదు.
Also Read : మంచి అవకాశం.. చంద్రయాన్-3 మహా క్విజ్ కు గడువు పెంపు
మీనా ఆరోపిస్తున్న దాని ప్రకారం.. నల్లధనం 50 లాకర్లలో ఉండగా.. వాటిలో 10 కొంతమంది అధికారులకు చెందినవి. ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పేపర్ లీక్ స్కామ్, రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ కుంభకోణం, జల్ జీవన్ మిషన్ స్కామ్ వంటి వాటి ద్వారా వచ్చిన నల్లధనం లాకర్లలో ఉందని మీనా ఆరోపించారు. అనంతరం ఎంఐ రోడ్డులోని కమర్షియల్ బిల్డింగ్ కు చేరుకున్న ఆయన.. దాదాపు 2గంటల పాటు అక్కడే ఉన్నారు. పోలీసులు, ఆదాయపు పన్ను శాఖలు, ఇతర ఏజెన్సీల అధికారులు జోక్యం చేసుకుని లాకర్లను తెరవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ సంస్థ ప్రధాన గేటుకు సీల్ వేశారు.
ఈ వ్యాఖ్యలపై గెహ్లాట్ తీవ్రంగా స్పందించారు. ఇది తన ప్రభుత్వం పరువు తీసే ప్రయత్నమని అన్నారు. "లాకర్లతో మాకు సంబంధం ఏమిటి? అతను మీడియాతో అక్కడికి (సంస్థ) వెళ్లి, అక్కడ ధర్నాకు కూర్చున్నాడు. అతను వార్తల్లో ఉండటానికి ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాడు. అతను ఈడీ కార్యాలయానికి వెళ్తాడు, తప్పుడు ఫిర్యాదులు చేస్తాడు" అని గెహ్లాట్ అన్నారు.