హైదరాబాద్, వెలుగు: రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌ఈసీ) ఆంధ్రప్రదేశ్ కర్నూలులో బ్రూక్‌ఫీల్డ్ నిర్మిస్తున్న1.04 గిగావాట్ (జీడబ్ల్యూ) హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు రికార్డు స్థాయిలో రూ. 7,500 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం రూ. 9,910 కోట్లు. ఆర్‌ఈసీ చరిత్రలో ఒక ప్రైవేట్ రంగ ప్రాజెక్ట్‌కు మంజూరు చేసిన అతిపెద్ద సింగిల్ ఫైనాన్సింగ్ ఇదేనని బ్రూక్‌ఫీల్డ్ తెలిపింది.
గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టర్ బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ ల సంయుక్త సంస్థ ఎవ్రెన్ ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఎవ్రెన్‌లో బ్రూక్‌ఫీల్డ్ కు 51.49 శాతం వాటా ఉంది. 1,040 మెగావాట్ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టును ఫర్మ్ డిస్పాచబుల్ రిన్యూవబుల్ ఎనర్జీ (ఎఫ్‌డీఆర్‌ఈ) ప్రాజెక్ట్‌గా వర్గీకరించారు. ఇది 640 మెగావాట్ విండ్, 400 మెగావాట్ సోలార్ కలయికతో కూడిన హైబ్రిడ్ ప్రాజెక్ట్.
