‘ఐరన్​ మ్యాన్​ థాలీ’  మామూలుగా ఉండదు

‘ఐరన్​ మ్యాన్​ థాలీ’  మామూలుగా ఉండదు

మీరు ఫుడీనా? అయితే కచ్చితంగా ఈ ‘ఐరన్​ మ్యాన్​ థాలీ’  తినాల్సిందే. దీని స్పెషాలిటీ ఏంటి?  అంటారా!  ఏదైనా రెస్టారెంట్​ లేదా హోటల్​కి వెళ్తే తిన్న వాటికి మనం డబ్బులు కడతాం. కానీ, ఈ ఐరన్​ మ్యాన్​ థాలీ తింటే ఎదురు డబ్బులిస్తారు. కాంప్లిమెంటరీగా ఏ వందో..రెండొందలో ముట్టజెప్తారు అనుకుంటే పొరపాటు. అక్షరాల ఎనిమిదిన్నర లక్షలు ఇస్తారు. ఇద్దరు కలిసి తినే ఈ థాలీలో  చాలానే వంటకాలు ఉన్నాయి. 

ఢిల్లీలోని ఆర్డౌర్​ 2.1 రెస్టారెంట్​..నార్త్​, సౌత్​ ఇండియా, చైనీస్​, సీఫుడ్​, బిర్యానీలకి పెట్టింది పేరు. అందుకే ఎప్పుడూ కస్టమర్స్​తో  కిక్కిరిసి ఉంటుంది ఈ రెస్టారెంట్​. అది గమనించిన ఫేమస్​ ఫుడ్​ బ్లాగర్​ మథుర్​ కూడా ఈ రెస్టారెంట్​లోకి వెళ్లాడు. ఫుడ్​ ఆర్డర్​ ఇవ్వడానికి మెనూ చూస్తే ‘ఐరన్​ మ్యాన్​ థాలీ’ అట్రాక్టివ్​గా కనిపించింది. అది కంప్లీట్ చేస్తే ఎనిమిదిన్నర లక్షలు ఇస్తారన్న విషయం తెలిశాక కచ్చితంగా ఆ థాలీ తినాల్సిందే అనుకున్నాడు. కానీ, అంతలోనే కండిషన్స్ అప్లయ్​ అన్నారు ఆ రెస్టారెంట్​ వాళ్లు. అరగంటలో థాలీ తినాలని చెప్పారు. బోనస్​గా ఆ థాలీని మరొకరితో షేర్​ చేసుకోవచ్చని కూడా చెప్పారు. ఆ వార్త వినగానే  రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అనిపించింది మథుర్​కి. వెంటనే ఐరన్​ మ్యాన్​ థాలీ ఆర్డర్​ చేశాడు.  

ఆ థాలీలో ఏముందంటే...
మొదట మథుర్​ పేరు మీద ఎనిమిదిన్నర లక్షల చెక్​ రెడీ చేసి తీసుకొచ్చాడు బేరర్​. అది చూశాక రెట్టింపు ఉత్సాహంతో సర్వింగ్​ ప్లేట్​ వైపు చూస్తే..స్టార్టర్స్​గా కబాబ్​లు, టిక్కాలు వడ్డించారు. ఆ వెంటనే మెయిన్​ కోర్సులో చోలే, దమ్​ ఆలు, దాల్​ మక్నీ, ఆలూ గోబీ, కడీ, షాహీ పనీర్​, కడాయి పనీర్...​ ఇలా రకరకాల వంటకాలు ప్లేట్​లో పెడుతున్నారు. అంతలోనే రెండు చిన్న బకెట్స్​ఒకదాంట్లో  అన్నం, రెండో దాంట్లో బిర్యానీ  టేబుల్​ మీదకి వచ్చింది. చివరాఖరిలో రెండు గిన్నెల గులాబ్​ జామూన్​, ఐదు రకాల డ్రింక్స్​ కూడా వచ్చేశాయి ఆ థాలీలో.  వాటన్నింటినీ తినడం మాట అటుంచితే.. చూస్తేనే కడుపు నిండిపోయింది అన్నాడు మథుర్​. అయినా సరే అరగంటలో కంప్లీట్​ చేయడానికి ఎంత కష్టపడ్డా తన వల్ల కాలేదు. ఈ ఫుడ్​ బ్లాగరే కాదు ఇప్పటివరకు ఈ థాలీని ఎవరూ పూర్తిగా తినలేకపోయారు. కానీ, మథుర్​ వల్ల ఈ థాలీ విపరీతంగా వైరల్​ అవుతోంది.

ఐరన్​ మ్యాన్​ థాలీ గురించి రీసెంట్​గా తన ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో ఒక వీడియో పోస్ట్​ చేశాడు మథుర్​. దానికి కొద్ది గంటల్లోనే మిలియన్స్​లో వ్యూస్​ వచ్చాయి. వేలమంది లైకులు కొట్టారు కూడా. అయితే ఈ థాలీ చూసి  కొందరు ఆ ఎనిమిదిన్నర లక్షలు హాస్పిటల్​ బిల్లుకి సరిపోవంటూ ఫన్నీగా రియాక్ట్​ అవుతున్నారు.