
- రూ.81.26 కోట్లు శాంక్షన్ చేసిన సర్కార్
- ఈనెల 27న శంకుస్థాపన!
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని కోర్టుకు కొత్త బిల్డింగ్‌లు నిర్మించనున్నారు. 5.01 ఎకరాల విస్తీర్ణంలో మొత్తంగా 7 కోర్టులకు బిల్డింగ్‌లు నిర్మించనున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.81.26 కోట్లు శాంక్షన్ చేసింది. ఈ నెల 27న బిల్డింగ్‌లకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం 1973లో కట్టిన బిల్డింగ్‌లో కోర్టు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత అవసరాలకు బిల్డింగ్ సరిపోకపోవడంతో కొత్త బిల్డింగ్‌లు నిర్మించనున్నారు.
52 ఏండ్లుగా పాత బిల్డింగ్‌ల్లోనే..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 1973లో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టును తాత్కాలిక భవనంలో ప్రారంభించారు.1977లో పక్కా భవనం నిర్మించారు. అప్పటి నుంచి కోర్టు కార్యకలాపాలు ఇక్కడి నుంచే నడుస్తున్నాయి. పెరిగిన జనాభా దృష్ట్యా వసతులు సరిపోవడం లేదు. దీంతో చాలా కాలంగా కొత్త కోర్టులను నిర్మించాలనే డిమాండ్ నడుస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త కోర్టు భవనాలకు నిధులు మంజూరు చేసింది.
అన్ని వసతులతో బిల్డింగ్‌లు
జిల్లా కేంద్రంలో కోర్టు సముదాయాన్ని నిర్మించడానికి ఇప్పటికే ప్రణాళిక రెడీ అయింది. ఇప్పుడున్న బిల్డింగ్‌ల స్థానంలోనే కొత్తవి నిర్మించనున్నారు. కొత్త బిల్డింగ్‌లు నిర్మించేదాకా కోర్టులను అద్దె భవనాల్లోకి తరలించనున్నారు. కొత్త బిల్డింగ్‌లను జీ ప్లస్ 4 పద్ధతిలో నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఏడు కోర్టులు, ప్రతి దానికి కోర్టు హాల్స్ నిర్మించనున్నారు.
ఏడు కోర్టుల్లో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి , సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ కోర్ట్, పోక్సో కోర్ట్, ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్, డిస్ట్రిక్ట్ కోర్టులకు బిల్డింగ్‌లు నిర్మించనున్నారు. .ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికాగా, ఈనెల 27న శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.