బీసీలకు 70 సీట్లిస్తాం..దమ్ముంటే అన్ని పార్టీలు ప్రకటించాలి

 బీసీలకు 70 సీట్లిస్తాం..దమ్ముంటే అన్ని పార్టీలు ప్రకటించాలి
  •  గృహలక్ష్మి లో మంత్రుల జోక్యం దేనికి
  • రూ.3 లక్షలతో సిమెంట్, స్టీల్ కొనగలరా 
  •  బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్: వచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. దమ్ముంటే రాష్ట్రంలోని మిగిలిన రాజకీయ పార్టీలు బీసీలకు 70 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన కాగజ్ నగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్దార్ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. 

గోల్కొండ కోటను ఆక్రమించి బహుజన పాలన సాగించిన సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో బహుజనులందరూ రాజకీయంగా ఒక్కటై కేసీఆర్ దోపిడీ పాలనను కూల్చాలనీ పిలుపునిచ్చారు. కేసీఆర్ పేదలకు ఇండ్లిస్తామని తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకం లో మంత్రులు, ఎమ్మెల్యే ల జోక్యం ఎందుకని ప్రశ్నించారు.  సర్కారు ఇచ్చే మూడు లక్షల రూపాయలతో ఇటుక, సిమెంట్, స్టీల్ ఎలా కొనగలరని అన్నారు. గృహలక్ష్మి ఇండ్లు రాని లబ్ధిదారులను శాశ్వతంగా వెయిటింగ్ లిస్ట్ లో పెడతామని చెబుతున్న  కేసీఆర్ లాంటి సీఎం దేశంలో,ప్రపంచంలో ఎక్కడా ఉండడని ఎద్దేవా చేసారు.

తొమ్మిదేళ్ళ కాలంలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వని సర్కార్ కొత్తగా ఏర్పడ్డ కుటుంబాలకు ఎలా న్యాయం చేయగలదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో  బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, మాజీ జడ్పీటీసీ పిల్లల తిరుపతి, సీతానగర్ ఎంపీటీసీ జామున మహేష్,కంబలె గౌతం,సెక్టర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్,షాకీర్, శోభన్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.