లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవితకు రాచమర్యాదలా?

లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవితకు రాచమర్యాదలా?

హుజూరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలు సామాన్యుడికో న్యాయం, కేసీఆర్ కూతురుకో న్యాయం చేస్తున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సామాన్యుడిని విచారించినప్పుడు థర్డ్ డిగ్రీ చేపట్టే సంస్థలు, కవితను మాత్రం తన ఇంట్లో రాచమర్యాదలతో విచారించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఆయన బహుజన రాజ్యాధికార యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకులకు సంపాదనే తప్ప సామాన్యుడి బాధలు పట్టడం లేదన్నారు.

పేదల డబ్బుతో ఢిల్లీలో కార్యాలయాలు కడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వార్ రూంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా న్యాయం జరగాలని కోరుకున్నారు. మండలంలోని తాడికల్ గ్రామాన్ని దత్తత తీసుకుంటానన్న.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. గ్రామంలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు. దత్తత అంటే భస్మం చేయడమా? అంటూ ధ్వజమెత్తారు. మొలంగూర్ గ్రామంలో కాకతీయుల కాలం నాటి కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరితే.. కబ్జా చేసి మైనింగ్ చేయాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కోటను ఆక్రమిస్తే బీఎస్పీ ఊరుకోదన్నారు.