
- కేసీఆర్‌ను గద్దె దించడం కోసమే కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర చేశాయి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- రేవంత్, బండి సంజయ్, కిషన్‌రెడ్డి పాత్రపై పోలీసులు దర్యాప్తు చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్‌ను గద్దె దింపడం కోసం మేడిగడ్డపై కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర పన్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మేడిగడ్డ కుంగినప్పుడు భారీ శబ్దాలు వచ్చాయంటూ మహదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏఈఈ ఫిర్యాదు చేశారని, బ్యారేజీ కుంగడం వెనుక అసాంఘిక శక్తులున్నాయని ఆయన పేర్కొన్నారని తెలిపారు. ఇప్పటివరకు ఆ అసాంఘిక శక్తులెవరో గుర్తించలేదని అన్నారు. మేడిగడ్డలో కేవలం ఒక్క పిల్లరే ఎందుకు కుంగిపోయిందని ప్రశ్నించారు.
కుంగితే అంత పెద్ద శబ్దాలు రావని అన్నారు. పేలుళ్లు జరిగితేనే అంత పెద్ద శబ్దం వస్తుందని, ఎన్‌డీఎస్ఏ ఆ కోణంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. మహదేవ్‌పూర్ పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి.. ఆ అసాంఘిక శక్తులు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్, కిషన్‌రెడ్డిలేమో తేల్చాలని డిమాండ్ చేశారు. ఆ ముగ్గురి ఫోన్ల డేటాను చెక్ చేస్తే వెంటనే తెలిసిపోతుందని అన్నారు. వారిపై సిట్వేసి.. విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
పేలుళ్ల కోణంలో దర్యాప్తు జరగలే
కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చేసే కుట్ర చేశారని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పేలుళ్ల కోణంలో విచారణ జరగలేదని అన్నారు. అసలు అక్కడ చిన్న చిన్న భూకంపాలేమైనా వచ్చాయా? అన్నది తేల్చాలని కోరారు. మేడిగడ్డపై స్క్రిప్ట్ రాసిచ్చిన డ్రామాలాగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఆంధ్రా పెట్టుబడిదారుల ఏజెంట్ అని విమర్శించారు. సీఎం రమేశ్ కంపెనీకి ఫోర్త్ సిటీలో కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. రేవంత్ వెనుక20 మంది ఆంధ్రా కాంట్రాక్టర్లు ఉన్నట్టు స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డే చెప్పారని ప్రవీణ్కుమార్అన్నారు.