
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్లోని సిర్పూర్పేపర్మిల్లు ద్వారా వెలువడుతున్న కాలుష్యం, కార్మికులకు జరుగుతున్న ప్రమాదాల విషయంలో స్థానిక ఎమ్మెల్యే హరీశ్ బాబు ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కాగజ్ నగర్ లోని తన నివాసంలో ఆదివారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఎస్పీఎంలో వెంటనే గుర్తింపు సంఘంఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కంపెనీలో భద్రత లేకుండా పోయిందని, విషవాయువుల వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయినా ఎమ్మెల్యే హరీశ్ పట్టించుకోవడం లేదన్నారు.
ఈ విషయంలో ఎమ్మెల్యే మాట్లాడకపోవడానికి కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కంపెనీ క్వార్టర్లలో పోలీస్ అధికారులు నివాసం ఉండడం వల్ల వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్లో రూ.12 వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయని, డ్రగ్స్ కంట్రోల్ చేయాల్సిన అధికార యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. గత నాలుగు నెలలుగా కంపెనీ పెట్టి డ్రగ్స్ దందా సాగిస్తున్నా ఎందుకు పసిగట్టలేదన్నారు. యూనివర్సిటీల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, వెంటనే విచారణ చేపట్టాలన్నారు. సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ లెండుగురె శ్యామ్ రావు, నాయకులు పాల్గొన్నారు.