బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆత్మహత్య బాధాకరం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆత్మహత్య బాధాకరం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆత్మహత్యపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. విద్యార్థి సూసైడ్ నోట్ చూసిన తరువాత తన మనసు కలిచి వేసిందన్నారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు కౌన్సిలింగ్ కోసం ప్రత్యేక కౌన్సిలర్లను నియమించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఐటీని ఒక జైలు మాదిరిగా మార్చేశారని రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇద్దరు విద్యార్థులు క్యాంపస్‭లో తిరిగినా నోటీసులు ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. విద్యార్థులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని.. తమ పిల్లలను కలిసేందుకు తల్లిదండ్రులకు కూడా లోపలికి పోయే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 

మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ట్రిపుల్ ఐటీని సందర్శించినంత మాత్రాన అక్కడి విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ ట్రిపుల్ ఐటీని సందర్శించి.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గడిచిన కొద్దీ రోజుల్లోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. చనిపోయిన భానుప్రసాద్ కుటుంబానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

బాసర ట్రిపుల్ ఐటీలో భానుప్రసాద్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భానుప్రసాద్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గదిలో నుంచి దుర్వాసన వచ్చే వరకు సిబ్బంది మృతదేహాన్ని గుర్తించకపోవడంపై కుటుంబసభ్యులు, బంధువులు మండిపడుతున్నారు. మరోవైపు భానుప్రసాద్ ఉరి వేసుకున్న గదిలో సూసైడ్ లెటర్ లభ్యమైంది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, మానసిక సమస్యే తన నిర్ణయానికి కారణమని అందులో రాశాడు. భానుప్రసాద్ సూసైడ్ లెటర్‭లో చెప్పిన వ్యాఖ్యలపై అతని కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు చదవలేక ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అంటున్నారు.  మూడు, నాలుగు రోజుల క్రితమే భాను ఆత్మహత్య చేసుకున్నా.. క్యాంపస్ అధికారులు ఎవరూ చెప్పలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.