బీఆర్ఎస్, బీజేపీ రెండూ దోపీడీ పార్టీలే : ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్

బీఆర్ఎస్, బీజేపీ రెండూ దోపీడీ పార్టీలే : ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్

దహెగాం, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీ రెండూ దోపిడీ పార్టీలేనని.. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేస్తే కమలం పార్టీకి వేసినట్లేనని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దహెగాం మండలంలోని మొట్లగూడ, రావులపల్లి, శంకరపురం, రాంపూర్, గిరవెళ్లి, గెర్రె, లోహ తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటై రహస్య ఒప్పందంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఆరోపించారు. 

సిర్పూర్ నియోజకవర్గంలోని పోలీసులు ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని, జిల్లా ఎస్పీ సురేశ్​కుమార్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు అనుకులంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ నేతృత్వంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం లేదన్న ఆయన.. ఎన్నికలు సజావుగా జరగాలంటే ఎస్పీని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. నియోజకవర్గంలో బీఎస్పీని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఒక్కటయ్యారన్నారు. 

ఎన్నికల్లో ఓట్ల కోసం అన్ని పార్టీలు సాధ్యంకాని హామీలు ఇస్తున్నారని, దొంగ హామీలు నమ్మి మోసపోవద్దని ఓటర్లను కోరారు. ఆయన వెంట ఆ పార్టీ జిల్లా నాయకులు పిల్లల తిరుపతి, మండల అధ్యక్షుడు ఎల్కరి ప్రశాంత్, నాయకులు దుర్గం దేవిదాస్, షాకీర్, కవిత, లక్ష్మి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.