దొరల బానిసత్వంలో నలుగుతున్నం.. బహుజనులకే రాజ్యాధికారం రావాలి: ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్

దొరల బానిసత్వంలో నలుగుతున్నం.. బహుజనులకే రాజ్యాధికారం రావాలి: ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్

వేములవాడ, వెలుగు : దొరల బానిసత్వంతో ఏండ్ల తరబడి నలిగిపోతున్నామని, వచ్చే ఎన్నికల్లో బహుజనులకే రాజ్యాధికారం రావాలని బీఎస్పీ రాష్ర్ట అధ్యక్షుడు ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ ​అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన బీఎస్పీ ప్రజా ఆశీర్వాద సభలో వేములవాడ, సిరిసిల్ల  బీఎస్పీ అభ్యర్థులు డా.గోలి మోహన్, పిట్టల భూమేశ్​తో కలిసి పాల్గొన్నారు. 

ప్రవీణ్​కుమార్​ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్​ను మార్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తాము హెలీక్యాప్టర్​తో తిరిగితే డబ్బులు ఎక్కడివని అడుగుతున్నారని, మన రాజ్యం మనకు రావడానికి కొట్లాడుమని 3 కోట్ల బహుజన బిడ్డలు పైసలు పంపిస్తున్నారన్నారు. వేములవాడలో ఆ దొర పోతే ఈ దొర..ఈ దొర పొతే..ఆ దొర వస్తూ బీసీ బిడ్డలపై కుట్రలు చేస్తున్నారన్నారు. నల్గొండలో వట్టె జానయ్యపై కుట్రపూరితంగా దాడి చేశారన్నారు. రూ.100 కోట్లు ఢిల్లీకి పంపించి, రూ.20 లక్షల వాచ్ పెట్టుకున్న కవితమ్మ.. ఆ సంపదన ఎలా వస్తుందో చెప్పాలన్నారు. మిడ్ మానేరు నిర్వాసితుల్లో మొదటి పరిహారం దొరలకే వచ్చిందని, అందుకే వడ్డించేది మన వాడైతేనే న్యాయం జరుగుతుందన్నారు.  

గాలి దూమారంతో కూలిన టెంట్లు 

సభ కొనసాగుతుండగా గాలి దుమారంతో టెంట్లు కూలిపోయాయి. దీంతో మహిళలు పరుగులు పెట్టారు. పోలీసులు, బీఎస్పీ లీడర్లు, కార్యకర్తలు మిగతా టెంట్లు కూలిపోకుండా అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో 20 మహిళలు, ముగ్గురు రిపోర్టర్లకు గాయాలు కాగా, వేములవాడ ఏరియా దవాఖానకు తరలించారు. 

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులా..?

ధర్మపురి : ‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా?’ అంటూ ప్రవీణ్​కుమార్ ఫైర్​ అయ్యా రు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీఎస్పీ అభ్యర్థి నక్క విజయ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అర్హులకు దళిత బంధు, కల్యాణ లక్ష్మి, బీసీ బంధు ఇవ్వడం లేదని ఆరోపించారు.