ఫ్లాయిడ్ ​ఫ్యామిలీకి 196 కోట్లు

ఫ్లాయిడ్ ​ఫ్యామిలీకి 196 కోట్లు
  • రాజీ కుదుర్చుకున్న మినియా పోలీసు సిటీ కౌన్సిల్
  • డబ్బిచ్చినా ఫ్లాయిడ్ తిరిగిరాలేడన్న కౌన్సిల్ ప్రెసిడెంట్

కిందటి ఏడాది మే 25న అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని ఓ పోలీసు అధికారి కాలితో అదిమిపట్టి చంపేసిన ఘటనపై బ్లాక్ లైవ్స్ మ్యాటర్ పేరిట పెద్ద ఉద్యమమే కొనసాగింది. అప్పటి నుంచి కోర్టులో నడుస్తున్న కేసుపై ఇప్పుడు రాజీ కుదిరింది. ఫ్లాయిడ్ ఫ్యామిలీకి 2.7కోట్ల డాలర్ల (సుమారు రూ.196.26కోట్లు) పరిహారం ఇచ్చేందుకు మినియా పోలీసు సిటీ కౌన్సిల్ అంగీకరించింది. 

మినియాపోలిస్: అమెరికా పోలీసుల జాత్యహంకార దాడిలో మరణించిన జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి 2.7 కోట్ల డాలర్లు (సుమారు రూ.196.26 కోట్లు) ఇచ్చేందుకు మినియాపోలిస్ సిటీ కౌన్సిల్ అంగీకరించింది. ఫ్లాయిడ్ కుటుంబంతో రాజీ కోసం శుక్రవారం కౌన్సిల్ సభ్యులు ఆయన ఇంటికి వెళ్లారు. అన్ని విషయాలను చర్చించి రూ.196 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పారు. కిందటేడాది మే 25న జార్జ్ ఫ్లాయిడ్ను ఓ పోలీస్ అధికారి కాలితో అదిమిపట్టి చంపేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాటి ప్రెసిడెంట్ ట్రంప్కు, జాతి వివక్షకు వ్యతిరేకంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ పేరిట ఉద్యమం చెలరేగింది. ఆ పోలీస్ అధికారిపై కోర్టులో విచారణ జరుగుతోంది.

ఇదే అతిపెద్ద సెటిల్మెంట్

కోర్టులో కేసు విచారణ జరుగుతున్నప్పుడు చేసుకున్న సెటిల్మెంట్లలో ఇదే అతిపెద్దదని ఫ్లాయిడ్ ఫ్యామిలీ తరఫు లాయర్ బెన్ క్రంప్ చెప్పారు. న్యాయం కోసం జరుగుతున్న పోరులో ఇదే మొదటి మెట్టు  అన్నారు. ఫ్లాయిడ్కు జరిగిన అన్యాయాన్ని డబ్బుతో పూడ్చలేమని వాపోయారు. కనీసం ఈ సెటిల్మెంట్తోనైనా నల్లజాతీయులపై మళ్లీ అలాంటి దారుణాలు జరగకుండా రూల్స్లో మార్పులు చేస్తే బాగుంటుందని మరో లాయర్ ఎల్. క్రిస్ స్టువర్ట్ అన్నారు. ‘అరెస్ట్ చేసేటప్పుడు కొట్టడం, ఊపిరి ఆగేలా తొక్కి పెట్టడంవంటి రూల్స్ను మార్చాలన్నారు. వాటిని మారిస్తే దేశంలో నల్లజాతీయుల బతుకులు బాగుపడతాయన్నారు. ఎంత డబ్బిచ్చినా చనిపోయిన ఫ్లాయిడ్ తిరిగిరాడన్న విషయం తనకు తెలుసని కౌన్సిల్ ప్రెసిడెంట్ లీసా బెండర్ అన్నారు. అన్ని వేళలా ఫ్లాయిడ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, అంతకుముందు 2019లో జస్టిన్ రజిక్ డమాండ్ అనే మహిళను పోలీసులు కాల్చి చంపిన ఘటనలో ఆమె కుటుంబానికి మినియాపోలిస్ కౌన్సిల్ 2 కోట్ల డాలర్లు (సుమారు రూ.145 కోట్లు) ఇచ్చి రాజీ కుదుర్చుకుంది. తన ఇంటి వెనక ఏదో నేరం జరుగుతోందని ఫిర్యాదు చేసిన పాపానికి ఆమెను పోలీసులు కాల్చి చంపారు.