లేబర్ చట్టాల రద్దు సరి కాదు

లేబర్ చట్టాల రద్దు సరి కాదు

బీజేపీ రూల్డ్ స్టేట్స్ తీరుపై ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిరసన
భారతీయ మజ్దూర్ సంఘ్ వెల్లడి

న్యూఢిల్లీ: బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లేబర్ చట్టాల సస్పెన్షన్ ను ఆర్ఎస్ఎస్ అనుబంధ ట్రేడ్ యూనియన్ భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఖండించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించింది. లాక్ డౌన్ వల్ల వలసకూలీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీనికి చాలా రాష్ట్రాలు లేబర్ చట్టాలను ఉల్లంఘించడమే కారణమని చెప్పింది. లేబర్ చట్టాలను ఉపసంహరించడం, వర్కింగ్ అవర్స్ ను 8 నుంచి 12 గంటలకు పెంచడాన్ని బీఎంఎస్ జనరల్ సెక్రటరీ విర్జేష్ ఉపాధ్యాయ్ తప్పుబట్టారు.

‘లేబర్ చట్టాలను మూడేళ్లపాటు సస్పెండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్, గుజరాత్ లు కూడా ఆర్డినెన్స్ లు జారీ చేశాయి. వర్కింగ్ అవర్స్ ను పెంచుతూ రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, ఒడిశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే దారిలో వెళ్లాలని ఆలోచిస్తున్నాయి. నిరసన చేయడం తప్ప మాకు వేరే దారి లేదు. ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటిస్తాం. ఈ నెల 13న బీఎంఎస్ నేషనల్ ఆఫీస్ బేరర్స్ వెబ్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం’ అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ప్యాకేజీని స్వాగతిస్తు్న్నట్లు చెప్పారు.