
1897 సంవత్సరానికి విక్టోరియా మహారాణి సింహాసనం అధిష్టించి 60 ఏండ్లు నిండాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని.. బ్రిటిష్ వాళ్ళు తమ చెప్పుచేతల్లో ఉన్న బానిస దేశాలన్నీటిల్లో గొప్ప ఉత్సవాలు చేస్తున్నారు. అదే సంవత్సరం భారతదేశంలో తీవ్రమైన కరువు కాటకాలు తాండవిస్తున్నాయి. మధ్య భారతంలోనే 1,20,000 మంది ఆకలితో తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ, బ్రిటిష్ వారి అధికార దర్పం ప్రదర్శించడానికి ప్రయత్నం జరిగింది. అది సహించలేని దామోదర్ పూనా ప్లేగు నివారణాధికారి ర్యాండ్ను మరో సైనిక అధికారి హైరెస్టును కాల్చి చంపాడు.
ఈ ఘటనను లోకమాన్య తిలక్.. కేసరి పత్రికలో చాలా విశ్లేషణతో రాశాడు. మహారాష్ట్ర ప్రాంతమంతా ఆ పత్రికను గురించి, అందులో భారత స్వాతంత్ర్య విశేషాలను గురించి అందరూ చర్చించుకునేవారు. అప్పుడు కేశవరావు బలిరాం హెగ్డేవార్ వయస్సు 8 ఏండ్లు. వాళ్ల పాఠశాలలో కూడా ఉత్సవాలు జరుగుతుంటే అందులో భాగంగా కేశవ చేతిలో కూడా లడ్డూ పెట్టారు. కానీ, అతని మనసు దేశానికి స్వాతంత్ర్యం లేకుండా చేసినవారిచ్చిన బహుమతులు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆలాగే విక్టోరియా రాణి పేరు మీద పాడుతున్న గీతాలు అతనికి నచ్చలేదు. అక్కడ మొదలైన ఆయన ఆవేదన 1925 విజయదశమి రోజున ఒక కొత్త అడుగుకు నాంది పలికింది. అదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘస్థాపన.
నాగపూర్లోని తన ఇంటిలో కేవలం 15 మందితో మొదలైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీవోగా నిలబడగలిగింది. 1928లో మొదటిసారి నాగపూర్లో 99 మంది ప్రతిజ్ఞ తీసుకొని ఈ దేశాన్ని కాపాడడానికి ఒక ఋషుల్లా, త్యాగమూర్తులులా పని చేస్తామని డాక్టర్ జీ ముందు ప్రతిన పూనారు. డాక్టర్ జీ దేహత్యాగం చేసిన నాటికి 140 ప్రాంతాలకు సంఘం విస్తరించింది. ఈ వందేండ్లలో లక్షలాదిమంది కార్యకర్తలు 80 వేలకుపైగా శాఖలు 35కు పైగా అనుబంధ విభాగాలతో వందల మంది మేధావులను, నాయకులను తయారు చేయగలిగిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నిజాయితీ గల సంస్థగా పేరుపొంది 100 సంవత్సరాల పుట్టినరోజు జరుపుకుంటోంది.
మొదటి నుంచి వ్యతిరేకతే...
ఆర్ఎస్ఎస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమయం 1951లో రెండు అకడమిక్ బుక్స్ సంఘ సిద్ధాంతంపై వెలువడ్డాయి. జే.ఏ కరన్ అనే అమెరికన్ ఏరోజు భారతదేశం సందర్శించలేదు. కానీ, రిలీజియస్ మిలిటెంట్ నేషనలిజం... ద కేస్ స్టడీ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అంటూ ఒక పరిశోధన చేశాడు. కేరళకు చెందిన ఆంథోనీ ఎలిజిమెంటం క్రైస్తవ ఫాదర్.. తన ఆసక్తితో ఫిలాసఫీ ఆన్ యాక్షన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ హిందూ స్వరాజ్ పేరుతో మరో పుస్తకం రాశారు. ఈ అమెరికన్ రాసిన పుస్తకం మొదలుకొని 1993 ఓరియంట్ లాంగ్ మెన్ ప్రచురించిన ఖాకీ షార్ట్స్ సాఫ్రాన్ ఫ్లాగ్స్ వరకు ఇంకా చెప్పాలంటే ఈరోజు వరకు ఎందరో సంఘాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు.
కానీ, ఆర్ఎస్ఎస్కు దేశభద్రత, దేశభక్తి ముఖ్యం. మతపరమైన ఏ ఆసక్తి లేదు. మతాలన్నీ వారి వారి వ్యక్తిగతానికి సంబంధించినవి. అయితే, మాతృభూమి రక్షణ ప్రథమ కర్తవ్యంగా ఈ దేశంలో నివసించే అన్ని మతాల వాళ్ల కర్తవ్యం అని భావిస్తుంది. ఆర్ఎస్ఎస్లో వ్యక్తిగత ఇష్టానికి తావులేదు. సమష్టి దేశం మాత్రమే ముఖ్యం.
పూలబాట కాదు
సంఘానికి వందేండ్లు వచ్చినా అదేమీ పూలబాట కాలేదు. ఎన్నోసార్లు సముద్ర కెరటంలా పడుతూ లేస్తూ ప్రయాణం సాగిస్తూ ఉన్నది. భారత స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పనిచేసిన మహాత్మా గాంధీ హత్య 1948 జనవరి 30న జరిగింది. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. సంఘాన్ని దోషిగా చూపించడానికి కొందరు చాలా ప్రయత్నం చేశారు. నాథూరాం వినాయక్ గాడ్సే చేసిన ఈ హత్య మొత్తం హిందూ సమాజాన్ని ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ను ఒక తీవ్రవాద దృష్టితో చూడడం చూపించడం ఆనాడు కొందరికి వరంగా మారింది.
నిజానికి 1933లో గాడ్సే మరాఠీలో ప్రసిద్ధంగా నడిచే అగ్రానీ పత్రికలో ఆర్ఎస్ఎస్ను విమర్శిస్తూ ఎన్నో వ్యాసాలు రాశారు. గాంధీ హత్య మొత్తం జాతికి విషాదకరమైన వార్త. మహాత్ముడి విషాద మరణానికి హిందూ ధర్మం ప్రకారం 13 రోజుల పాటు సంతాపం తెలియజేయాలని ఆదేశిస్తూ 13 రోజులు అన్ని సంఘ కార్యకలాపాలు నిలిపి సంతాప దినాలను ప్రకటించాలని సంఘ విభాగాలన్నింటికీ గురూజీ ఆదేశాలిస్తూ టెలిగ్రాములు కూడా పంపారు. ఇన్ని చేసినా గాంధీ హత్యను ఆర్ఎస్ఎస్పై తోసేందుకు విశ్వ ప్రయత్నం జరిగింది. దేశ విభజన సమయంలో కాశ్మీర్ విషయంలో ఆర్ఎస్ఎస్ కు స్పష్టత ఉంది. 1934 డిసెంబర్ 25వ తేదీ మహారాష్ట్రలోని వార్ధాలో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని మహాత్మా గాంధీ సందర్శించి అస్పృశ్యతలేని ఒక అద్భుత సంఘటన చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సంఘానికి దేశం మద్దతు
దేశం సంఘానికి మద్దతుగా నిలబడింది అన్న విషయాన్ని నెహ్రూ ప్రభుత్వం గ్రహించింది. 12 జులై 1949 నాడు సంఘంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ పటేల్.. గురూజీకి లేఖ రాశారు. గాంధీజీ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ నిర్దోషి అంటూ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిగా పనిచేసిన జేజే కపూర్ కమిషన్ దాదాపు 100 మందికి పైగా సాక్షులను విచారించి 1969లో నివేదిక ఇచ్చింది. పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన శరణార్థులు తీవ్ర మతహింసకు గురి అయ్యారు. అలాంటివాళ్లను కాపాడే బాధ్యత ఆర్ఎస్ఎస్ తన భుజస్కంధాలపై వేసుకున్నది. బాధితుల కోసం ఎన్నో సహాయ సంక్షేమ కార్యక్రమాలను ఆర్ఎస్ఎస్ నిర్వహించింది. ఇదే విషయాన్ని జనవరి 7, 1948 హిందూ పత్రికలో నాటి హోం మంత్రి సర్దార్ పటేల్ ప్రశంసించారు. సైద్ధాంతికంగా సంఘం చేసిన పోరాటాల్లో ఇది ప్రధానమైన విషయంగా చెప్పుకోవచ్చు.
- శ్రీకౌస్తుభ