
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి జంటా ముగ్గురు పిల్లలను కనాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. ప్రస్తుతం ఉన్న 2.1 జననాల రేటు ఆందోళనకరమన్నారు. జననాల రేటు తక్కువగా ఉన్న జాతి అంతరిస్తుందని నిపుణులు చెప్పారన్నారు. ఆరెస్సెస్ ఏర్పడి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహిస్తున్న ‘ఆరెస్సెస్ శతాబ్ది లెక్చర్ సిరీస్’లో మూడో రోజు గురువారం మీడియా సమావేశంలో భాగవత్ మాట్లాడారు.
‘‘సరైన సమయంలో పెండ్లి చేసుకుని పిల్లల్ని కంటే తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు నాకు చెప్పారు. ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే, వారు ఇగో మేనేజ్ మెంట్ నేర్చుకుంటారు. మరోవైపు జనాభా పెరుగుదల వరం, సమస్య కూడా. అందుకే జనాభా పెరుగుదలకు కళ్లెం వేయడానికి ముగ్గురిని మించి కనరాదు కూడా” అని భాగవత్ అన్నారు.
అన్ని కమ్యూనిటీల్లో జననాల రేటు తగ్గుతోందని, ముఖ్యంగా హిందువుల్లో ఇది ఎక్కువగా ఉందన్నారు. మత మార్పిళ్లు ఆందోళనకరమని భగవత్ చెప్పారు. అది మంచిది కాదని ముస్లింలు, క్రిస్టియన్లు కూడా భావిస్తున్నారని అన్నారు. అలాగే చొరబాట్లతో దేశంలో అసమానతలు ఏర్పడతాయన్నారు. చొరబాట్లను ఆపేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దేశ పౌరులంతా తమ వంతుగా కృషి చేయాలన్నారు.
కేంద్రంతో సంఘర్షణ ఉంది.. కానీ గొడవ లేదు
కేంద్ర ప్రభుత్వంతో సంఘర్షణ ఉంది కానీ గొడవ లేదని భగవత్ అన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయాల్లో ఆరెస్సెస్ జోక్యం ఉండదని, తాము సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తామన్నారు. అలాగే 75 ఏండ్లు నిండినవాళ్లు రిటైర్ కావాలని తానెప్పుడూ అనలేదని భగవత్ చెప్పారు. సంఘ్ తమకు ఏమి చెబితే అది మాత్రమే చేస్తామన్నారు. తనకు 80 ఏండ్లు వచ్చినా ఆరెస్సెస్‌కు నాయకత్వం వహిస్తానన్నారు. బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో ఆర్ఎస్ఎస్ జోక్యం ఏమీ ఉండదని, అలా ఉండినట్టయితే ఇప్పటికే అధ్యక్షుడి ఎంపిక పూర్తయ్యేదన్నారు.