- వారు మోదీ విజయాన్ని మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నారు
- గల్లీలో ప్రజల వాయిస్‌ను పట్టించుకోవడం లేదు
- పాత కార్యకర్తలను బీజేపీ నిర్లక్ష్యం చేసింది
- సోషల్‌మీడియా మోజులో పడడం వల్లే సీట్లు తగ్గినయ్
- ఆర్ఎస్ఎస్ అనుబంధ మ్యాగజైన్ ‘ఆర్గనైజర్’లో కథనం
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజీపీ నాయకులు, కార్యకర్తల అతివిశ్వాసానికి రియాలిటీ చెక్ అని ఆర్ఎస్ఎస్ పేర్కొన్నది. వారు ప్రధాని మోదీ విజయాన్ని మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నారు తప్ప గల్లీల్లో ప్రజల వాయిస్‌ను వినడం లేదని తెలిపింది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ అనుబంధ మ్యాగజైన్ ‘ఆర్గనైజర్’లో ఓ కథనం ప్రచురితమైంది. బీజేపీ ఈ ఎన్నికల్లో స్వయంసేవక్‌ల సహకారం కూడా తీసుకోలేదని వెల్లడించింది. అసలు ఆర్ఎస్ఎస్ కార్యర్తలను బీజేపీ ఎందుకు పక్కన పెట్టిందో వారికే తెలియాలని పేర్కొంది. గుర్తింపుకోసం వెంపర్లాడకుండా అంకితభావంతో పనిచేసే పాత కార్యకర్తలను బీజేపీ నిర్లక్ష్యం చేసిందని తెలిపింది. సోషల్‌మీడియా సెల్ఫీ పవర్డ్ యాక్టివిస్ట్‌లను నమ్ముకోవడం వల్లే ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాలేదని పేర్కొంది.
మోదీ సవాల్ బీజేపీ కార్యకర్తలకు అర్థం కాలేదు: రతన్ శారద
ప్రతిపక్షాలను డిఫెన్స్‌లో పడేసేలా మోదీ ఇచ్చిన 400 ప్లస్ సీట్ల సవాల్‌ను బీజేపీ నాయకులు, కార్యకర్తలు అర్థం చేసుకోలేకపోయారని ఆర్డికల్లో ఆర్ఎస్ఎస్ శాశ్వత సభ్యుడు రతన్ శారద పేర్కొన్నారు. ఫీల్డ్‌లో హార్డ్‌వర్క్ చేస్తేనే టార్గెట్‌ను రీచ్ అవుతామని, సోషల్‌మీడియాలో పోస్టర్లు, సెల్ఫీలు షేర్చేస్తే కాదని చురకలంటించారు. మోదీ మ్యాజిక్కూడా ఓ పరిమితి ఉందనే విషయం మరిచిపోవద్దని అన్నారు. అనవసర రాజకీయాల వల్ల కూడా బీజేపీకి సీట్ల సంఖ్య తగ్గిందని చెప్పారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేనను చీల్చడం ద్వారా బీజేపీకి దక్కిన ప్రయోజనమేమీ లేదని అన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 48 ఎంపీ సీట్లుంటే శిండే నేతృత్వంలోని శివసేన 8, అజిత్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఒక్క సీటును మాత్రమే గెలుచుకున్నాయని చెప్పారు. 2019లో 23 సీట్లు వస్తే.. అనవసర రాజకీయం వల్ల ఆ సంఖ్య ఇప్పుడు 9కి పడిపోయిందని అన్నారు. ‘‘బీజేపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు ప్రజలకు అందుబాటులో ఉండరు? ఎందుకు వారి నియోజకవర్గాల్లో కనిపించరు? ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఓపికకూడా వారికి ఉండదా? ఇవే సీట్ల సంఖ్య తగ్గేందుకు ప్రధాన కారణం” అని శారద విశ్లేషించారు.