నాటి నుంచి నేటి వరకు ..సీపీఐ పేదల పక్షమే..ఆర్ఎస్ఎస్, జనసంఘ్ ఏనాడైనా ప్రజల కోసం పనిచేశాయా?

నాటి నుంచి నేటి వరకు ..సీపీఐ పేదల పక్షమే..ఆర్ఎస్ఎస్, జనసంఘ్ ఏనాడైనా ప్రజల కోసం పనిచేశాయా?
  •     ఐదు జీపీలను భద్రాచలంలో కలపాలి
  •     సీపీఐ జాతీయ కంట్రోల్​ కమిషన్​ చైర్మన్​ నారాయణ

భద్రాచలం, వెలుగు: పదవుల కన్నా ప్రజలే ముఖ్యమనే సిద్ధాంతంతో వందేళ్లుగా సీపీఐ మనుగడ సాధిస్తోందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ స్పష్టం చేశారు. సీపీఐ శత వసంత ఉత్సవాల ప్రచార జాతాను శనివారం చర్ల మండల కేంద్రంలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. 

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన స్థానిక పార్టీ కార్యాలయం నుంచి వేలాది మందితో డప్పు వాయిద్యాలు, కొమ్ము నృత్యాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం, పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన సీపీఐ నాటి నుంచి నేటి వరకు అలుపెరుగని పోరాటాలు చేస్తోందన్నారు. 

ప్రస్తుతం అమలవుతున్న అనేక ప్రజాహిత చట్టాలు కమ్యూనిస్టుల పోరాట ఫలితమేనని చెప్పారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరికాదన్నారు.దేశ ప్రజల శ్రేయస్సుకు ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘ్‌  ఏం చేశాయో చెప్పాలని ప్రశ్నించారు. 

కమ్యూనిస్టులను విమర్శించడం సూర్యునిపై ఉమ్మివేయడమేనని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో ఆంధ్రాలో విలీనం చేసిన ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి రాని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలని సూచించారు.

ఈ నెల 18న ఖమ్మం నగరంలో జరిగే సీపీఐ శత వసంత ఉత్సవాల ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, పలువురు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు పాల్గొన్నారు.