V కావేరీ బస్సు ప్రమాద ఘటనతో RTA అధికారులు అలర్ట్.. హైదరాబాద్ సిటీలోకి ఎంటరైన ప్రతీ బస్సును ఆపేశారు !

V కావేరీ బస్సు ప్రమాద ఘటనతో RTA అధికారులు అలర్ట్.. హైదరాబాద్ సిటీలోకి ఎంటరైన ప్రతీ బస్సును ఆపేశారు !

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ కర్నూలు జిలాలో ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ బస్సు ప్రమాదం తర్వాత RTA అధికారులు అలర్ట్ అయ్యారు. శనివారం (అక్టోబర్ 25) ఉదయం నుంచే హైదరాబాద్ లోకి ఎంటరైన ప్రతి బస్సును ఆపేసి చెకింగ్ చేస్తున్నారు. బస్సుల ఫిట్ నెస్, సేఫ్టీ మెజర్స్ మొదలైన అన్ని రకాల అంశాలను పరీక్షిస్తున్నారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆపి.. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ అధికారులు. బెంగళూరు హైవేలో హైదరాబాద్ లోకి ఎంటరవుతున్న ప్రతీ బస్సును తనిఖీలు చేస్తున్నారు. అదే విధం తొండుపల్లి టోల్ గేట్ ప్రైవేట్ బస్సులపై  ఆర్టీఏ అధికారులు కొరడా  ఝులుపించారు.. నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఐదు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లపై కేసు నమోదు చేశారు అధికారులు. బస్సులో పరిమితికి మించి పది, పదిహేను మందిని ఎక్కించుకుని తిరుగుతున్న బస్టర్ ట్రావెల్స్ బస్సు ను సీజ్ చేశారు. దాసరి ట్రావెల్స్ చెందిన బస్సు ను ఆర్టీఏ అధికారి తనిఖీలు చేసి అవాక్కయ్యారు. బస్సు వెనకాల భాగంలో టైర్ల మధ్య ఉన్న బేస్ రాడ్డు తుప్పు పట్టి కనిపించడంతో బస్సు పై కేసు నమోదు చేసి ప్రయాణికులను దింపేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని ప్రైవేటు బస్సు యాజమాన్యాలకు అధికారులు హెచ్చరించారు.

ఇటు బండ్లగూడ, ఎల్బీనగర్ ఏరియాల్లో కూడా తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. బండ్లగూడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేసిన సిబ్బంది.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు చలానాలు విధించారు. 

ఎల్బీ నగర్ చింతలకుంటలో ఆటో నగర్ లో ట్రావెల్స్ బస్సులపై దాడులు నిర్వహించారు అధికారులు. నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న 5బస్సులపై కేసులు నమోదు చేశారు. 

షాద్ నగర్ టోల్ ప్లాజా దగ్గర:

షాద్ నగర్ టోల్ ప్లాజా దగ్గర తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. బంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం  జాతీయ రహదారిపై వివిధ పట్టణాల నుండి వస్తున్న ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేస్తున్నారు. సరైన నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు.

హైదరాబాద్ కూకట్‌పల్లిలో:

ఒకవైపు సిటీ వెలపల, టోల్ గేట్ల దగ్గర అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తుంటే.. హైదరాబాద్ సిటీలో కూడా దాడులు చేస్తున్నారు. కూకట్‌పల్లి ప్రాంతంలో ఆర్టీవో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. రోడ్లపై నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బస్సులు, ఆటోలు , క్యాబ్‌లను పరిశీలిస్తున్నారు. ఇన్సూరెన్స్, లైసెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. 

కర్నూలు ఘటన తర్వాత ప్రత్యేకంగా ట్రావెల్స్ వాహనాలపై దృష్టి సారించారు అధికారులు. భద్రత దృష్ట్యా సీటు బెల్టులు, అత్యవసర ద్వారాలు , ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉన్నాయా లేవా అనే కోణంలో తనిఖీలు చేస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.