
- ఇప్పటినుంచే ఫిట్ నెస్ టెస్టులపై ఫోకస్ పెట్టిన ఆఫీసర్లు
- ఉమ్మడి జిల్లాలో 2 వేల బస్సులు.. కాలం చెల్లినవి 400కుపైగానే
- పాత బండ్లపై ఆరా తీస్తున్న అధికారులు
- జూన్ 12 నుంచి స్పెషల్ రైడ్స్ కు ప్లాన్
హనుమకొండ, వెలుగు: విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఆర్టీఏ ఆఫీసర్లు బడి బస్సుల ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటినుంచే ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ విద్యాసంస్థల బస్సులు ఆర్టీఏ ఆఫీస్‌ల ఎదుట బారులు తీరుతున్నాయి. కాలం చెల్లినా, ఫిట్ నెస్ లేని బస్సులతో ప్రమాదాలు పొంచి ఉండగా, జూన్ 12 నుంచి అలాంటి బస్సులపై స్పెషల్ రైడ్స్ నిర్వహించేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.
కాలం చెల్లినవే 20 శాతానికి పైగా!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు రెండు వేల వరకు ప్రైవేటు స్కూల్ బస్సులున్నాయి. అందులో అత్యధికంగా ప్రైవేటు విద్యాసంస్థలు ఉండే హనుమకొండ జిల్లాలో 976 బస్సులు ఉండగా, వరంగల్ జిల్లాలో 443, మహబూబాబాద్ లో 160, జనగామలో 163, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 225 వరకున్నాయి. జిల్లాల్లోని బస్సుల్లో దాదాపు 20 శాతం వరకు ఫిట్ నెస్ లేని బస్సులే ఉంటున్నాయి. హనుమకొండ జిల్లాలో 976 బస్సులు ఉండగా, అందులో 210 వరకు కాలం తీరినవే ఉండటం గమనార్హం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 ఏండ్లకు పైబడిన వాటితో పాటు ఫిట్ నెస్ లేని వెహికల్స్ అన్నీ కలిపి 400కుపైగానే ఉన్నా కొంతమంది ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులు ఆర్టీఏ ఆఫీసర్లను మేనేజ్ చేసుకుని వాటినే నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఏం తక్కువైనా ఓకే..
బడి బస్సుల ఫిట్ నెస్ టెస్టులు నిర్వహిస్తున్న ఆర్టీఏ అధికారులు నామమాత్రపు చర్యలతో మమ అనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించే అధికారులు ఆ బస్సు టైర్ల కండిషన్ నుంచి పిల్లలు ఎక్కే మెట్లు, సీట్లు, కిటికీలకు గ్రిల్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఫైర్ కిట్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో ఉన్నాయో లేదో తప్పనిసరిగా చెక్ చేయాలి. కొన్ని బడా, కార్పొరేట్ స్కూల్ బస్సుల కిటికీలకు గ్రిల్స్, ఫస్ట్ ఎయిడ్, ఫైర్ కిట్లు ఏమీ లేకున్నా ఆఫీసర్లు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రతి బస్సును ఆర్టీఏ ఆఫీస్ ఆవరణలోని ట్రాక్ పై నడిపించి కండిషన్ టెస్టు చేయాలి. కానీ ఆర్టీఏ ఆఫీస్ ఆవరణలో ట్రాక్ సరిగా లేకపోవడంతో అధికారులు ఆ టెస్టు నిర్వహించకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బడి బస్సులతో పాటు సాధారణ వెహికల్స్ విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రతి సంవత్సరం లాగే నామమాత్రపు టెస్టులతో ఫిట్ నెస్ టెస్టుల పని ముగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
12 నుంచి స్పెషల్ రైడ్స్
ఫిట్ నెస్ లేకపోవడం, అనుభవం లేని డ్రైవర్ల కారణంగా ప్రైవేటు స్కూళ్ల బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆఫీసర్లు ఫిట్ నెస్ లేని బస్సులపై ఏటా స్పెషల్ రైడ్స్ నిర్వహిస్తున్నా.. కొన్ని స్కూల్స్ అధికారులను మేనేజ్ చేసుకుంటూ బస్సులను తిప్పుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఆర్టీఏ అధికారులు బడి బస్సుల ఫిట్ నెస్ పై ముందస్తు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ప్రైవేటు విద్యాసంస్థలకు ముందస్తు సమాచారం ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో హనుమకొండ జిల్లా చింతగట్టులోని ఆర్టీఏ ఆఫీస్ నాలుగైదు రోజులుగా ప్రైవేటు బస్సులు క్యూ కడుతున్నాయి. జూన్ 12వ తేదీ నుంచి స్కూల్స్ అన్నీ రీ ఓపెన్ కానుండగా.. అదే రోజు నుంచి ఫిట్ నెస్ లేని, కాలం చెల్లిన బస్సులపై స్పెషల్ రైడ్స్ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.