చేవెళ్ల ప్రమాదం జరిగిన 24 గంటల్లోనే మరో ఘోరం.. కరీంనగర్ జిల్లాలో ట్రాక్టర్ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

చేవెళ్ల ప్రమాదం జరిగిన 24 గంటల్లోనే మరో ఘోరం.. కరీంనగర్ జిల్లాలో ట్రాక్టర్ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట బ్రిడ్జ్ దగ్గర కూడా మంగళవారం ఉదయం బస్సు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వడ్ల లోడ్ ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. పలువురికి గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మెట్ పల్లి డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తుండగా ఘటన జరిగింది.

రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కంకర లోడ్‌‌తో వస్తున్న టిప్పర్.. మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది స్పాట్‌‌లోనే చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో ట్రీట్‌‌మెంట్ పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. మరో కుటుంబానికి చెందిన తండ్రి, కూతురు, మనుమరాలు చనిపోయారు.

ఈ కుటుంబంలో తల్లితో పాటు ఆమె ఒడిలోనే 40 రోజుల పసికందు ప్రాణాలు విడిచిన దృశ్యం గుండెలను పిండేసింది. మూలమలుపు వద్ద అధిక వేగంగా వచ్చిన టిప్పర్ రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో బస్సును ఢీకొట్టి, దాని కుడివైపు భాగాన్ని చీల్చుకుంటూ బస్సులోకి కంకరను కుమ్మరించింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే కంకర కింద నలిగిపోయి 13 మంది మహిళలు, ఒక పసికందు సీట్లలో ఎక్కడివారక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదం తర్వాత తల భాగం వరకు కంకరలో కూరుకుపోయిన ప్రయాణికులు సాయం కోసం పెట్టిన ఆర్తనాదాలు కంటతడి పెట్టించాయి.