రేపట్నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు

రేపట్నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్: లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసిన తెలంగాణ.. ఏపీలో లాక్ డౌన్ సడలింపులకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఏపీలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు లాక్ డౌన్ కర్ఫ్యూ సడలించిన నేపధ్యంలో ఈ టైమింగ్స్ కు అనుగుణంగా బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. కర్ఫ్యూ సడలించిన వేళల్లో ప్రయాణికులు గమ్య స్థానం చేరుకునేలా బస్సులు నడపనున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి ఏపీ కర్ఫ్యూ వేళలకు అనుగుణంగా బస్సులు నడుస్తాయి. ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటే బస్సుల్లో ప్రయాణం సులువు అవుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 
ఏపీఎస్ ఆర్టీసీ కూడా తెలంగాణకు బస్సు సర్వీసులు పునః ప్రారంభించాలని నిర్ణయించింది. ఏపీ కర్ఫ్యూ ఆంక్షల సడలింపు వేళలకు అనుగుణంగా బస్సులు నడపాలని నిర్ణయించింది. తెలంగాణకు ఎప్పుడు చేరుకున్నా.. తిరిగి ఏపీకి కర్ఫ్యూ లేని సమయంలో చేరుకునే లా బస్సులు నడపనున్నారు. 
తెలంగాణ నుంచి కర్నాటకకు కూడా..
కర్నాటకలో కూడా వారాంతాల్లో లాక్ డౌన్ కొనసాగిస్తూ కర్ఫ్యూ ఆంక్షలు సడలించిన విషయం తెలిసిందే. అక్కడి కర్ఫ్యూ సడలింపులకు అనుగుణంగా తెలంగాణ నుంచి కర్నాటకకు.. కర్నాటక నుంచి తెలంగాణకు టీఎస్ ఆర్టీసీ బస్సులు నడపనుంది. కర్నాటకలో ఉదయం 5 నుంచి సాయంత్రం 7 వరకు బెంగళూరు మినహా మిగిలిన ప్రాంతాలకు బస్సులు నడుస్తాయి. వారాంతాల్లో లాక్ డౌన్ నేపద్యంలో శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు తెలంగాణ నుంచి కర్నాటకకు.. కర్నాటక నుంచి తెలంగాణకు ఎలాంటి బస్సులు నడవవు.