V6 News

RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో ఉద్రిక్తత..వరంగల్ బంద్ కు పిలుపునిచ్చిన జేఏసీ

RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో ఉద్రిక్తత..వరంగల్ బంద్ కు పిలుపునిచ్చిన జేఏసీ

పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో వరంగల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వరంగల్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు ఆర్టీసీ జేఏసీ నేతలు. హనుమకొండ లో RTC డిపో ముందు RTC కార్మికులు, BRS శ్రేణులు ధర్నాకు దిగారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా  ముందస్తుంగా భారీగా పోలీసులు మోహరించారు. పోస్ట్ మార్టమ్ అనంతరం మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామం నర్సంపేటకు తరలించారు. ఇవాళ (శుక్రవారం, ఏప్రిల్24) నర్సంపేటలో నిర్వహించే అంత్యక్రియల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని RTC కార్మికులతో పాటు, రాష్ట్ర JAC నాయకులు అంతిమ సంస్కారాలలో పాల్గొననున్నారు. 

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గురువారం తెల్లవారు జామున 2.30 గంటలకు మృతి చెందినట్టు కంచన్ బాగ్ DRDO అపోలో ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. గురువారం ఆర్టీసీ సమ్మె సందర్భంగా శంకర్ నిప్పంటించుకొని ఆత్మహత్యా యత్నం చేసిన విషయం తెలిసిందే. మొదట వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. మార్గమధ్యంలోనే శంకర్ మృతి చెందగా.. అంబులెన్స్ సిబ్బంది CPR చేసి ప్రాణాలు పోశారు. అనంతరం హుటాహుటిన కంచన్ బాగ్ DRDO అపోలో ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి తెల్లవారు జామున శంకర్ మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు.శంకర్ గౌడ్ మృతితో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేసేందుకు పిలుపునిచ్చారు. 

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దని క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్చలు జరుపుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.