ఏసీ బస్సులతో ఆదాయానికి ఆర్టీసీ ప్లాన్

ఏసీ బస్సులతో ఆదాయానికి ఆర్టీసీ ప్లాన్

హైదరాబాద్, వెలుగు:  గత రెండున్నరేండ్లుగా ఆర్టీసీ సమ్మె నష్టాలు, కరోనా కష్టాలు  దాటుకొని ఆదాయం పెంచుకునే దిశగా వెళ్తోంది. పెరిగిన పెట్రోల్,​ డీజిల్ ధరలను మేనేజ్ చేసుకుంటూ సర్వీసులను నడుపుతుంది.  సిటీలో నడిచే ఏసీ బస్సులను ఇంటర్ డిస్ట్రిక్ సర్వీసులుగా మార్చి ఆదాయం పెంచుకునేందుకు దృష్టి పెట్టింది. కరోనా టైంలో డిపోలకే పరిమితమైన ఏసీ బస్సులు సంస్థకు అదనపు భారంగా మారాయి.  ఐటీ కారిడార్ పూర్తిస్థాయిలో ఓపెన్​ చేయకపోవడంతో  ఏసీ బస్సులకు ఆదరణ లేకపోగా గిరాకీ పడిపోయింది. దీంతో ఖాళీగా ఉంచడం కంటే శివారు జిల్లాలకు నడుపుతూ నిర్వహణ భారం తగ్గించుకునేలా ప్లాన్​ చేసింది. ఇప్పటికే ఆర్టీసీ తీవ్ర నష్టాల పాలవగా, రోజువారీగా 50–80 లక్షలకు చేరింది. దీంతో మైలేజీ రాని బస్సులు, ఆక్యుపెన్సీ లేని రూట్లపై ఫోకస్ పెట్టి మంచి ఫలితాలు సాధిస్తుంది.  ముఖ్యంగా సిటీలో తిరిగే 80 ఏసీ బస్సులను శివారు జిల్లాలకు తిప్పుతుంది.  రద్దీ లేని రూట్లలో నడపడం కంటే,  రద్దీ ఉండి, ఆక్యుపెన్సీ వచ్చే  రూట్లకే ప్రాధాన్యత ఇస్తుంది. 

ఇప్పటివరకు అన్ని నష్టాలే
సిటీలో వివిధ ప్రాంతాల్లో తిరిగే ఏసీ బస్సులతో భారీగా నష్టాలే వస్తున్నాయి. నెలకు నష్టం రూ. 30–40లక్షల పైనే ఉంటుంది. ఆదాయం కంటే ఖర్చులు పెరగడంతో బస్సులను పొదుపుగా వాడేందుకు ఫోకస్ ​చేశారు. పెరుగుతున్న వ్యయ భారాన్ని తగ్గించుకునేలా గ్రేటర్​ ఆర్టీసీ అధికారులు ప్లాన్​ చేశారు.  రెండు నెలల ఆదాయ, ఖర్చులను చూస్తే.. సెప్టెంబర్ లో రూ. కోటి వస్తే, ఖర్చు  రూ. కోటిన్నర పైనే ఉంది. అక్టోబర్ లో రూ. 2.10 కోట్ల నష్టం వచ్చింది. ఇలా పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవడమే ఉత్తమమని అధికారులు భావిస్తున్నారు.