సంక్రాంతికి 503 స్పెషల్ బస్సులు.. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 8 ఆర్టీసీ డిపోల ద్వారా ప్రత్యేక సర్వీసులు 

సంక్రాంతికి 503 స్పెషల్ బస్సులు.. ఉమ్మడి  మెదక్ జిల్లా వ్యాప్తంగా 8 ఆర్టీసీ డిపోల ద్వారా ప్రత్యేక సర్వీసులు 
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 ఆర్టీసీ డిపోల ద్వారా ప్రత్యేక సర్వీసులు 
  • ఎక్కువమంది ఉంటే ఒకే ఊరికి స్పెషల్ బస్సు

సంగారెడ్డి, వెలుగు: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సేవలందించనుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి స్పెషల్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. మెదక్ రీజియన్ పరిధిలో ఉన్న 8 డిపోల వారీగా 503 బస్సులను నడిపేందుకు ప్లాన్ చేసింది. బస్సుల సంఖ్య పెరగడంతో పండగ పూట ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని డిపోల వారీగా స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒకే గ్రామానికి వెళ్లేవారు ఎక్కువమంది ఉంటే వారి కోసం ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు.

పది రోజుల పాటు ..

సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల వారీగా మొత్తం 503 స్పెషల్ బస్సులు పది రోజులపాటు సేవలందించనున్నాయి. సంగారెడ్డి డిపో నుంచి 103  బస్సులు, నారాయణఖేడ్ డిపో నుంచి112, జహీరాబాద్ డిపో నుంచి 52 బస్సులు, మెదక్ డిపో నుంచి 26 బస్సులు,  నర్సాపూర్ డిపో నుంచి 29 బస్సులు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో నుంచి 63 బస్సులు, దుబ్బాక డిపో నుంచి 23 బస్సులు,  సిద్దిపేట డిపో నుంచి 95 బస్సులు నడపనున్నారు. ఆయా బస్సులు శుక్రవారం నుంచి మొదలైనప్పటికీ దశలవారీగా సర్వీసులు పెంచనున్నారు. ఈ నెల 11, 12, 13 తేదీలతో పాటు 16 నుంచి 20 వరకు స్పెషల్ బస్సులను నడపనున్నారు. 

ప్రైవేట్ ట్రావెల్స్ లలో చార్జీల భారం

తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రయాణికుల నుంచి భారీగానే దండుకుంటున్నాయి. జిల్లాలోని పటాన్ చెరు, అమీన్​పూర్, రామచంద్రపురం, బీరంగూడ ప్రాంతాల్లో ఎక్కువగా ఏపీ వాసులు నివసిస్తున్నారు. వీరంతా ప్రైవేట్ ట్రావెల్స్ ను  ఆశ్రయిస్తుండగా ప్రయాణికుల అవసరాలను ఆసరా చేసుకునే ట్రావెల్స్ యాజమాన్యాలు ఒకటికి రెండింతల చార్జీల భారం మోపుతున్నారు.

ఉదాహరణకు వెయ్యి రూపాయల చార్జి ఉన్న రూట్ కు రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ముకుమ్మడిగా చార్జీలు పెంచి ప్రయాణికుల వద్ద దండుకుంటున్నాయి. సంక్రాంతి సందర్భంగా రామచంద్రపురం, లింగంపల్లి నుంచి రోజు వందల సంఖ్యలో ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి.

 కావాలంటే స్పెషల్ బస్సు ఏర్పాటు చేస్తాం

గ్రామాలకు వెళ్లే వారు చాలామంది ఉంటే వారికోసం ప్రత్యేకంగా బస్సు కావాలన్నా ఏర్పాటు చేస్తాం. ప్రయాణికుల రద్దీ పెరిగితే వారి సౌకర్యార్థం మరిన్ని స్పెషల్ బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 డిపోల వారీగా స్పెషల్ బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికులు ఆర్టీసీ స్పెషల్ బస్సుల సర్వీసులను సద్వినియోగంచేసుకోవాలి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితంగా ఉంటుందని ప్రయాణికులు గమనించాలి.  –విజయ్ భాస్కర్, మెదక్ రీజినల్ మేనేజర్