
- సజ్జనార్ సర్క్యులర్‌పై యూనియన్ నేతల ఫైర్
- 27న ఏర్పాటు చేసిన మీటింగ్‌ను రద్దు చేయకుంటే నిరసన తప్పదని హెచ్చరిక
హైదారాబాద్, వెలుగు: ఆర్టీసీలో ‘వెల్ఫేర్ మీటింగ్’ చిచ్చు పెట్టింది. యూనియన్లకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న ప్రశాంత వాతావరణాన్ని ఈ మీటింగ్ దెబ్బతీసిందని జేఏసీ లీడర్లు విమర్శిస్తున్నారు. ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీల స్థానంలో యూనియన్లను తిరిగి అనుమతించాలని ఇటీవల సమ్మె వాయిదాపై చర్చల సందర్భంగా రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్టీసీ జేఏసీ నేతలు కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
తీరా ఈనెల 27న హైదరాబాద్ లోని ఆర్టీసీ కళా భవన్ లో రాష్ట్ర స్థాయి వెల్ఫేర్ కమిటీల మీటింగ్ జరుగుతుందని సంస్థ యాజమాన్యం శుక్రవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలతో ఇది జారీ కావడంతో జేఏసీ నేతలు భగ్గుమంటున్నారు. ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి యూనియన్లను పునరుద్ధరించాలని తాము ప్రభుత్వాన్ని కోరుతుంటే, తమను రెచ్చగొట్టే రీతిలో సజ్జనార్ ఈ కమిటీలతో మీటింగ్ పెట్టడం ఏమిటని ఆర్టీసీ యూనియన్ ల నేతలు అశ్వత్థామ రెడ్డి, థామస్ రెడ్డి, ఈదురు వెంకన్న మండిపడుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో యూనియన్లు రద్దు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీలో యూనియన్లను రద్దు చేసి వాటి స్థానంలో రాష్ట్రవ్యాప్తంగా డిపోల పరిధిలో, వర్క్ షాపుల పరిధిలో వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేసింది. కార్మికులు, ఉద్యోగులకు ఏ సమస్య ఉన్నా ఈ కమిటీల దృష్టికి తీసుకురావాలని చెప్పింది. గతంలో యూనియన్ల పాత్రను ఇవి పోషించేలా కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే ఆర్టీసీలో యూనియన్లను అనుమతిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అది అమలు కాకపోవడంతో పాటు ఇతర డిమాండ్లపై జేఏసీ ఈనెల 7న సమ్మెకు దిగాలని నిర్ణయించింది. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి జోక్యంతో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో జేఏసీ నేతలు చర్చలు జరిపి సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.
ఆ చర్చల్లో వెల్ఫేర్ కమిటీలను రద్దుచేసి యూనియన్లను అనుమతించాలనే జేఏసీ డిమాండ్‌కు మంత్రి సానుకూలత వ్యక్తం చేశారని యూనియన్లు చెప్తున్నాయి. తమ డిమాండ్ల అమలు కోసం ప్రభుత్వంపై సానుకూల దృక్పథంతో ఉన్న జేఏసీ నేతలకు సజ్జనార్ సర్క్యులర్ తీవ్ర ఆగ్రహం కలిగించింది. దీంతో ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన వెల్ఫేర్ కమిటీ మీటింగ్ ను వెంటనే వాయిదా వేసుకోవాలని లేకుంటే భవిష్యత్తు కార్యచరణకు సిద్ధమవుతామని జేఏసీ నేతలు ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి హెచ్చరించారు. అసలు ఆ సర్క్యులర్‌ను ప్రభుత్వ అనుమతితో జారీ చేశారా.. లేక, సజ్జనార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారా.. స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.