అధికారపార్టీపై ఆర్టీసీ కార్మికుల గుర్రు.. కాంగ్రెస్​కే మద్దతు ప్రకటించిన 3యూనియన్లు

అధికారపార్టీపై ఆర్టీసీ కార్మికుల గుర్రు.. కాంగ్రెస్​కే మద్దతు ప్రకటించిన 3యూనియన్లు
  •  మూడు పీఆర్సీలు, డీఏ బకాయిలు పెండింగ్
  • ఆస్తులు, ఎన్నికల కోసమే విలీనం డ్రామా
  • సరిపడా టైమ్​ ఉన్నా పూర్తి చేయలేదని కార్మికుల ఫైర్
  • కాంగ్రెస్ మేనిఫెస్టోలో పలు హామీలు
  • రాష్ట్రంలో  ఆర్టీసీ కుటుంబాల ఓట్లు సుమారు 15 లక్షలు

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్​ సర్కారు నమ్మించి మోసం చేసిందని ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. మూడు పీఆర్సీలు, డీఏ బకాయిలు, సీసీఎస్, పీఎఫ్ బకాయి లు ఇలా ఏదీ ఇవ్వలేదని, సంస్థను ప్రభుత్వంలో విలీ నం చేస్తామని మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా ఆర్టీసీ సమస్యలను ప్రస్తావించకపోవడంపై మండిపడుతు న్నారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే విలీనం ప్రాసెస్ పూర్తి చేస్తామని, పీఆర్సీలు ఇస్తామని, ప్రభు త్వోద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పిస్తామని, యూనియన్లు పునరుద్ధరిస్తామని కాంగ్రెస్​ మేని ఫెస్టోలో ప్రకటించింది. ఆర్టీసీలో 45 వేల మంది కార్మి కులుండగా..వారి కుటుంబాలు, పిల్లలు, రిటైర్ కార్మికులు ఇలా 15 లక్షల ఓట్లున్నాయి. దీంతో ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు కార్మికుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

కీలక యూనియన్ల మద్దతు కాంగ్రెస్​కే..

ఆర్టీసీలో తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ), ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) తెలంగా ణ జాతీయ మజ్దూర్ యూనియన్, ఎఫ్​డబ్ల్యూఎఫ్ కీలకంగా ఉన్నాయి. టీఎంయూలో ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న వర్గానికి థామస్ రెడ్డి నేతృత్వం వహిస్తుండగా, మరో వర్గానికి ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన అశ్వత్థామరెడ్డి సారథ్యం వహిస్తున్నారు. అయితే, ఈయూ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి ఇటీవల ఎల్ బీ నగర్ నుంచి ఇండిపెండెంట్​గా నామినేషన్ వేశారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ కోరడంతో వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం రాజిరెడ్డి అన్ని డిపోలకు వెళ్తూ కాంగ్రెస్​కు ఓటెయ్యాలని కోరుతున్నారు. అశ్వత్థామరెడ్డి ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్​లో చేరలేదని చెప్పినప్పటికీ, అన్ని జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. టీజేఎంయూ నేత హన్మంతు ముదిరాజ్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తున్నారు.  మరోవైపు ఆర్టీసీలో ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న టీఎంయూ థామస్ రెడ్డి వర్గం సైలెంట్ గా ఉంది. మునుగోడు బై పోల్ టైమ్ లో అక్కడ 8 వేల మంది ఆర్టీసీ కార్మికులు ఉండడంతో మంత్రులు హరీశ్, కేటీఆర్, పువ్వాడ, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వారి ఓట్ల కోసం కార్మిక సంఘాలకు అపాయింట్ మెంట్లు ఇవ్వడం, చర్చల పేరుతో హడావుడి చేశారు. తర్వాత ఆర్టీసీని పట్టించుకోలేదు. యూనియన్​ నేతలకు మంత్రి కేటీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. పీఆర్సీలు కూడా ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వంపై కార్మికులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

ఆస్తుల కోసమే విలీనమా?

రెండు నెలల కింద ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. చివరి అసెంబ్లీ సమావేశాల్లో బిల్ పాస్ కావాలని హడావుడిగా బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ కు పంపగా, కార్మికుల సంక్షేమ అంశాలు సరిగా పేర్కొనలేదని, బిల్ క్లారిటీ లేదని అనుమతి ఇవ్వలేదు. గవర్నర్ అన్ని యూనియన్లతో మాట్లాడి.. సమస్యలు తెలుసుకొని తిప్పి పంపారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో గవర్నర్ ఓకే చెప్పడం, అసెంబ్లీలో బిల్లు పాస్ కావడం, గవర్నర్ ఆమోదించడం పూర్తయ్యాయి. తర్వాత సరిపడా టైం ఉన్నా విలీనం ప్రాసెస్ మాత్రం ముందుకు సాగలేదు. మరోవైపు సుమారు రూ.65 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, మేధావులు ఆరోపించారు. ఇందుకు తగినట్లే ప్రభుత్వ వ్యవహార శైలి ఉండడంతో విలీన ప్రక్రియపై కార్మికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే  విలీన ప్రక్రియను పూర్తిచేస్తామని కాంగ్రెస్​ మేనిఫెస్టోలో పెట్టడంతో మెజారిటీ కార్మికులు ఆ పార్టీ వైపు మొగ్గుతున్నట్లు కార్మిక సంఘాల్లో చర్చ జరుగుతోంది.

ఎన్నో సమస్యలు..

ఆర్టీసీ కార్మికులకు 2012 పీఆర్సీ బకాయిలు 50 శాతం ఇవ్వాల్సి ఉండగా, 2017, 2021 పీఆర్సీలు బకాయి పడింది. ఈ మూడు ఇస్తే ఒక్కో కార్మికుడికి రూ.4 లక్షలు వస్తాయని భావిస్తున్నారు. తొమ్మిది డీఏల బకాయిలు రూ.750 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది. క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీకి రూ.1200 కోట్లు, పీఎఫ్ ట్రస్ట్ కు రూ.1500  కోట్లు మేనేజ్​మెంట్ వాడుకుంది. రిటైర్డ్​కార్మికులకు బెనిఫిట్స్, కారుణ్య నియామకాలు రెగ్యులర్ పద్ధతిలో చేపట్టకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, అధికారుల వేధింపులతో కార్మికుల ఆత్మహత్యలు, సరిపడా బస్సులు లేక రెగ్యులర్ కార్మికులను వీఆర్ఎస్ కు పంపడం ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని కార్మికులంటున్నారు.  యూనియన్లు లేక డిపోల్లో అధికారులు వేధింపులు పెరిగాయంటున్నారు.